అఖిల్ కోసం రంగంలోకి దిగిన రాజమౌళి.. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!
on Sep 26, 2023
హీరోగా లాంచ్ కావడానికి ముందు అక్కినేని వారసుడు అఖిల్.. స్టార్ అవుతాడని, సంచలనాలు సృష్టిస్తాడని అంచనాలు ఉండేవి. తీరా లాంచ్ అయ్యాక అఖిల్ ఆ అంచనాలకు ఏమాత్రం అందుకోలేకపోతున్నాడు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అఖిల్'తో హీరోగా పరిచయమైన ఈ అక్కినేని యువ హీరో, మొదటి సినిమాతోనే ఘోర పరాజయాన్ని చూశాడు. ఆ తర్వాత 'హలో', 'మిస్టర్ మజ్ను', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'ఏజెంట్' సినిమాలు చేయగా.. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మాత్రమే హిట్ అందుకుంది. ఇక చివరి చిత్రం 'ఏజెంట్' అయితే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలపై అక్కినేని అభిమానులకు కూడా రోజురోజుకి నమ్మకం పోతోంది. ఎలాగైనా అఖిల్ ఓ భారీ విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అఖిల్ కోసం దర్శకధీరుడు రాజమౌళి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
పరాజయాలు ఎదురవుతున్నప్పటికీ అఖిల్ తో భారీ సినిమాలు చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేయడంలేదు. అఖిల్ తన తదుపరి సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేయనున్నాడు. అఖిల్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందనున్న ఈ మూవీకి నూతన దర్శకుడు అనిల్ దర్శకత్వం వహించనున్నాడు. స్క్రిప్ట్ దశ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్న నిర్మాతలు.. ఈ ప్రాజెక్ట్ కోసం రాజమౌళిని, ఆయన కుమారుడు కార్తికేయని రంగంలోకి దింపారట. రాజమౌళి సూచనలతో స్క్రిప్ట్ అద్భుతంగా వస్తోందట. రాజమౌళిని.. జక్కన్న అని, పని రాక్షసుడు అని అంటుంటారు. ప్రతి సీన్ మీద, ప్రతి షాట్ మీద ఆయన ఎంతో శ్రద్ధ పెట్టి.. శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతారు. అందుకే ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తాయి. అలాంటి రాజమౌళి సూచనలు, సలహాలతో స్క్రిప్ట్ సిద్ధమవుతుందంటే ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు సంబరపడుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
