తెలుగు సినిమాని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్ళిన దర్శకధీరుడు!
on Oct 10, 2022

తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప దర్శకులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు అనగానే ఎస్.ఎస్.రాజమౌళి గుర్తుకొస్తారు. మొదట టీవీ సీరియల్ దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టిన ఆయన జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'స్టూడెంట్ నెం.1'(2001) సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం ఘన విజయం సాధించినప్పటికీ ఆ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వహించడంతో రాజమౌళి ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదు.
మొదటి సినిమా విడుదలైన దాదాపు రెండేళ్లకు రాజమౌళి దర్శకత్వం వహించిన రెండో సినిమా 'సింహాద్రి'(2003) విడుదలైంది. అందులోనూ జూనియర్ ఎన్టీఆరే హీరో కావడం విశేషం. ఈ చిత్రం అప్పటిదాకా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులు సృష్టించింది. తెలుగు సినీ చరిత్రలో అత్యధిక కేంద్రాలలో 175 రోజులు ఆడిన చిత్రంగా ఎప్పటికీ చెక్కు చెదరని రికార్డు 'సింహాద్రి' పేరిట ఉంది. 'సింహాద్రి' సినిమా తారక్ ని టాప్ స్టార్ గా మార్చడమే కాకుండా, రాజమౌళి ప్రతిభ ఏంటనేది అందరికీ తెలిసేలా చేసింది.
ఆ తర్వాత 'సై', 'ఛత్రపతి', 'విక్రమార్కుడు', 'యమదొంగ' ఇలా వరుస విజయాలతో రాజమౌళి అపజయమెరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇక రామ్ చరణ్ హీరోగా రూపొందించిన 'మగధీర'(2009)తో ఇండస్ట్రీ హిట్ అందుకొని రాజమౌళి తన స్థాయిని ఎన్నో రెట్లు పెంచుకున్నారు. హీరోగా నటించిన రెండో సినిమాకే రామ్ చరణ్ కి స్టార్ స్టేటస్ వచ్చేలా చేశారు. అంతటి సంచలన విజయం తర్వాత ఊహించని విధంగా సునీల్ తో 'మర్యాద రామన్న' చిత్రం చేసి తన రాజముద్ర విజయముద్ర అని మరోసారి రుజువు చేశారు. ఆ తర్వాత 'ఈగ'తో ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఆయన.. ప్రభాస్ తో వంద కోట్లకు పైగా బడ్జెట్ తో 'బాహుబలి' సినిమాని ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటిదాకా తెలుగులో రూ.100 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమానే లేదు.. అలాంటిది ఏ నమ్మకంతో వందల కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారని పెదవి విరిచారంతా. కానీ ఆ చిత్రం విడుదలైతేనే కానీ తెలియలేదు రాజమౌళి కల ఎంత పెద్దదోనని.
'బాహుబలి-1', 'బాహుబలి-2' తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపుని తీసుకొచ్చాయి. అప్పటిదాకా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనే ఆలోచనను పోగొట్టి అందరి చూపు టాలీవుడ్ పై పడేలా చేశారు రాజమౌళి. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా మరే భారతీయ సినిమాకు రానంత గుర్తింపు 'ఆర్ఆర్ఆర్' సొంతం. హాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ చిత్రానికి ఫిదా అయ్యారు. పలు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకునే అర్హత ఈ చిత్రానికి ఉందంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. రాజమౌళి సైతం ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలిపేందుకు ఏకంగా 15 విభాగాల్లో నామినేషన్స్ కోసం క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అందరూ ఆశిస్తున్నట్టుగా ఆస్కార్ నామినేషన్స్ లో 'ఆర్ఆర్ఆర్' నిలిస్తే అది రాజమౌళికి, తెలుగు సినీ పరిశ్రమకి మాత్రమే కాదు.. భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణం అని చెప్పొచ్చు.
రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటిదాకా 12 సినిమాలు రాగా అన్నీ విజయం సాధించాయి. ఆయన తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్నారు. ఇది రాజమౌళి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందనుంది. ఒకప్పుడు రాజమౌళి సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసేవారు. 'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇక నుంచి ఆయన సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఆసక్తి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మహేష్ తో చేస్తున్న చిత్రంతో రాజమౌళి ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి.
నేడు(అక్టోబర్ 10) రాజమౌళి పుట్టినరోజు
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



