శ్రీదేవి గారు చనిపోయారా.. నమ్మలేకున్నా
on Feb 25, 2018
అలనాటి సినీతార శ్రీదేవి మరణం పట్ల సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసిన శ్రీదేవి గారి ఆకస్మిక మరణం నమ్మలేకుండా ఉన్నా అన్నారు. దుబాయ్‌లో ఓ వివాహానికి వెళ్లిన ఆమె.. అక్కడ చనిపోయారని తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని పవన్ తెలిపారు. ఈ మేరకు జనసేన కార్యాయలం ఒక ప్రకటన విడుదల చేసింది.
‘ అసమానమైన అభినయ ప్రతిభతో శ్రీదేవి భారత ప్రేక్షక లోకం అభిమానాన్ని చూరగొన్నారు. శ్రీదేవి ఇక లేరు అనే మాట నమ్మలేనిది. కానీ ఆమె వెండితెరపై పోషించిన భిన్నమైన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. శ్రీదేవి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే మానసిక స్థైర్యాన్ని భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను’
‘బాలనటిగా, కథానాయికగా దక్షిణ భారత సినీ రంగంలో విజయాలు అందుకున్న శ్రీదేవి అదే స్థాయిలో హిందీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. బడి పంతులు సినిమాలో బాల నటిగా ‘బూచాడమ్మా బూచాడు’ అనే పాటలో కళ్లు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు మర్చిపోలేరు. అన్నయ్యతో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో దేవకన్య ఇంద్రజగా కన్పించిన తీరు..‘మానవా..’ అంటూ చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకునేవే. విరామం తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్’, ‘మామ్’ చిత్రాల్లో నటించి తన శైలిని ఈ తరానికి చూపించారు. పెద్ద కుమార్తెని కథానాయికగా చిత్ర సీమలోకి తీసుకువస్తున్న తరుణంలో ఈ లోకాన్ని వీడటం బాధాకరం’ అని పవన్ అన్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
