'యశోద' వివాదానికి తెరపడింది
on Nov 29, 2022

సమంత టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'యశోద' నవంబర్ 11న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో Eva అనే సంస్థ సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నట్టు చూపించారు. అయితే ఈ సినిమాలో చూపించిన Eva పేరుతో నిజంగానే ivf సెంటర్ ఉంది. దీంతో ఈ చిత్రం తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ ఆసుపత్రి యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన మేకర్స్ ఈ వివాదానికి తెరపడేలా చేశారు.
'యశోద' నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తాజాగా eva ivf సెంటర్ ఎండీతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. eva అంటే జీవితం అనే అర్థమని, కథకు సరిగ్గా సరిపోతుందన్న ఉద్దేశంతో పెట్టాం గానీ మరే ఇతర ఉద్దేశంతో పెట్టలేదని అన్నారు. "తమ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ eva యాజమాన్యం కోర్టుని ఆశ్రయించడంతో మేం షాకయ్యాం. వెంటనే వారిని సంప్రదించి, ఇది మాకు తెలియకుండా జరిగిపోయిందని చెప్పాము. మా సినిమా నుంచి eva అనే దానిని తొలగిస్తామని చెప్పగానే వారు చాలా పాజిటివ్ గా స్పందించారు. థియేటర్స్ వెర్షన్ మార్చడానికి కాస్త సమయం పడుతుందని, ఓటీటీ వెర్షన్ లో మాత్రం eva అనేది అసలు కనిపించదు" అని కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
eva ivf సెంటర్ ఎండీ మాట్లాడుతూ.. "మా బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా ఉండటం కోసమే మేం కోర్టుని ఆశ్రయించాం. ఇంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుంది అనుకోలేదు. నిర్మాత త్వరగా స్పందించి క్షమాపణలు చెప్పి, eva కి సంబంధించినవి తొలగించారు. ఈ విషయంలో మేం సంతోషంగా ఉన్నాం. డాక్టర్లు ప్రాణాలను కాపాడటానికే ఉంటారు. కానీ ఎవరో కొందరు చేసిన పనుల వల్ల.. డాక్టర్లు అందరిని తప్పుగా చూడొద్దు" అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



