ENGLISH | TELUGU  

'అర్జున్‌రెడ్డి'గా శ‌ర్వానంద్ చేసుంటే..?

on Aug 5, 2020

 

సందీప్‌రెడ్డి వంగా డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మైన 'అర్జున్‌రెడ్డి', దాని హిందీ రీమేక్ 'క‌బీర్‌సింగ్' బ్లాక్‌బ‌స్ట‌ర్స్ కావ‌డంతో ఆయ‌న పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగి పోయింది. 'క‌బీర్‌సింగ్' త‌ర్వాత ఆయ‌న ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నే ఆస‌క్తి సినీ ప్రియులంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. 'అర్జున్‌రెడ్డి' ముందువ‌ర‌కు సందీప్ పేరు ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా వినిపించ‌లేదు. అంత హ‌ఠాత్తుగా, ఒక ఉరుములా, ఒక మెరుపులా ఆయ‌న వ‌చ్చాడు. నిజానికి 'అర్జున్‌రెడ్డి' టైటిల్ రోల్‌కు ఫ‌స్ట్ చాయిస్ విజ‌య్ దేవ‌ర‌కొండ కాదు.. శ‌ర్వానంద్‌! అవును.. అది నిజం.

ఆస్ట్రేలియాలోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ స్కూల్ ఆఫ్ సిడ్నీలో ఫిల్మ్ మేకింగ్‌లో సందీప్‌ మూడేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేశాడు. అక్క‌డికి వెళ్ల‌డానికి మొద‌ట ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. కానీ ఆయ‌న సినిమా పిచ్చి బాగా ముదిరింద‌ని అర్థం చేసుకొని పంపించారు. ఫిల్మ్ కోర్స్ చేసేట‌ప్పుడే చాలా షార్ట్ ఫిలిమ్స్  చేశాడు. 2009లో ఇండియాకు తిరిగొచ్చాడు. మొద‌ట అక్కినేని నాగార్జున మూవీ 'కేడి'కి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేశాడు. "దాని త‌ర్వాత‌ ఒక క‌థ రాసుకొని అల్లు అర్జున్‌కు చెప్పాను. అది ఆయ‌న‌కు న‌చ్చింది కానీ నాకు ఫ‌స్ట్ టైమ్ కాబ‌ట్టి అది ముందుకు క‌ద‌ల్లేదు. త‌ర్వాత ఇంకో క‌థ రాసి. ఒక ప్రొడ్యూస‌ర్‌కు వినిపిస్తే తీస్తాన‌ని ముందుకొచ్చి, ఎనిమిది నెల‌ల త‌ర్వాత వెనుకంజ వేశారు. దాంతో ప‌రిస్థితి మ‌ళ్లీ మొద‌టికొచ్చింది" అని సందీప్ తెలిపాడు.

2014లో 'అర్జున్‌రెడ్డి' స్క్రిప్ట్‌ను రెండు నెల‌ల్లో రాశాడు సందీప్‌. మొద‌ట శ‌ర్వానంద్‌కు వినిపించాడు. అత‌ను ఇష్ట‌ప‌డ్డాడు కూడా. దానిపై ఇద్ద‌రూ ఏడెనిమిది నెల‌లు క‌లిసి ప్ర‌యాణించారు కూడా. అయితే శ‌ర్వా తీసుకొచ్చిన నిర్మాత‌లెవ‌రికీ స్క్రిప్ట్ న‌చ్చ‌క‌పోవ‌డం, అత‌ను త‌న పాత క‌మిట్‌మెంట్స్ ప్ర‌కారం వేరే సినిమాలు చేయ‌డానికి వెళ్లిపోవ‌డంతో ఆ కాంబినేష‌న్ కుద‌ర‌లేదు. అప్పుడు బాగా నిరాశ చెందాడు సందీప్‌. అమెరికాలో ఉండే అన్న ప్ర‌ణ‌య్ ధైర్యం చెప్పాడు. ఆ సినిమాని తామే తీద్దామ‌న్నాడు.

అప్పుడు 'అర్జున్‌రెడ్డి' లాంటి అన్‌క‌న్వెన్ష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌ను ఏ ఇమేజ్‌లేని యాక్ట‌ర్‌తో చేయించాల‌ని అనుకున్నాడు సందీప్. ఆయ‌న దృష్టిలో విజ‌య్ ప‌డ్డాడు. ఆ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్‌ని చూపిస్తే సినిమాకు ప్ల‌స్ అవుతుంద‌నుకున్నాడు. అలా విజ‌య్‌ను ఎంపిక‌చేశాడు. అప్ప‌టికింకా 'పెళ్లిచూపులు' సినిమా రాలేదు. 'అర్జున్‌రెడ్డి' సినిమా విడుద‌ల‌య్యే టైమ్‌కు అది రిలీజై ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మ‌య్యాడు విజ‌య్‌. "దాని వ‌ల్ల ఎక్కువ‌మంది ప్రేక్ష‌కుల‌కు విజ‌య్ రీచ్ అయ్యాడు. అది నా సినిమాకు హెల్ప్ అయ్యింది. త‌ను సూప‌ర్‌గా చేశాడు. బేసిక‌ల్లీ మ‌నోడు మంచి వ్య‌క్తి. అర్జున్‌రెడ్డి కేర‌క్ట‌ర్‌కు పూర్తి ఆపోజిట్" అని చెప్పాడు సందీప్‌.

అదీ విష‌యం. అర్జున్‌రెడ్డికి ఫ‌స్ట్ ఛాయిస్ అయిన శ‌ర్వానంద్ గ‌నుక ఆ సినిమా చేసుంటే అత‌ని కెరీర్ ఇప్పుడు ఎంత పీక్‌లో ఉండేదో ఊహించుకోవ‌చ్చు. ఒక్కోసారి ఒక‌రికి త‌ప్పిపోయిన అవ‌కాశం మ‌రొక‌ర్ని వ‌రించి, వారిని రాత్రికి రాత్రే స్టార్ట్‌ను చేస్తుంద‌నేది విజ‌య్ కెరీర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.