గాంధీగిరిని తీసుకొచ్చిన 'శంకర్‌దాదా జిందాబాద్'కు పదిహేనేళ్లు!
on Jul 26, 2022

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన 'శంకర్‌దాదా జిందాబాద్', హిందీలో రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో సంజయ్ దత్ నటించగా బ్లాక్‌బస్టర్ హిట్టయిన 'లగే రహో మున్నాభాయ్' మూవీకి రీమేక్. ఇది 'మున్నాభాయ్ ఎంబీబీఎస్'కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. ఆ సినిమా తెలుగు రీమేక్ 'శంకర్‌దాదా ఎంబీబీఎస్' (2005)లోనూ చిరంజీవి హీరోగా చేశారు. మొదటి సినిమా బాగా ఆడగా, సీక్వెల్ ఆశించిన రీతిలో ప్రజాదరణ పొందలేదు. అందులో నాయికగా నటించిన సోనాలీ బెంద్రేతో చిరు కెమిస్ట్రీ గొప్పగా పండింది. ఆ ఇద్దరి రొమాన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. సీక్వెల్‌లో కొత్తమ్మాయి, మోడల్ అయిన కరిష్మా కోటక్ హీరోయిన్‌గా నటించింది. ఆమె కానీ, ఆమెతో చిరు రొమాన్స్ కానీ ఏమాత్రం ఆడియెన్స్‌ను అలరించలేదు.
ప్రభుదేవా డైరెక్ట్ చేసిన 'శంకర్‌దాదా జిందాబాద్'లో అతి ప్రధానమైన గాంధీజీ పాత్రను ప్రముఖ మరాఠీ నటుడు దిలీప్ ప్రభావల్కర్ చేశారు. ఒరిజినల్ మూవీలోనూ ఆయనే నటించారు. ఆయనకు రీప్లేస్‌మెంట్ ఎవరూ కనిపించక ప్రభావల్కర్‌నే తెలుగు రీమేక్‌కూ తీసుకున్నారు. ప్రభుదేవా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీకాంత్ (ఏటీఎం), వెన్నిరాడై నిర్మల, సాయాజీ షిండే, బ్రహ్మానందం, శరత్‌బాబు, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం కీలక పాత్రల్లో నటించగా, "ఆకలేస్తే అన్నం పెడతా" అనే హిట్ ఐటమ్ నంబర్‌ను యానా గుప్తా చేసింది.
ఈ సినిమాకు సంబంధించిన విశేషం.. పలువురు స్టార్లు స్పెషల్ అప్పీరెన్స్ ఇవ్వడం. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రవితేజ.. అలా కొన్ని సెకన్ల పాటు మెరుపులా మెరిశారు. సదా, నాగబాబు, ప్రభుదేవా కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. సినిమా ఫ్లాపయినా దేవి శ్రీప్రసాద్ సంగీతం, చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి.
'గాంధీగిరి' అనే పదాన్ని తొలిసారిగా వాడుకలో తెచ్చింది దీని మాతృక అయిన 'లగే రహో మున్నాభాయ్'. ఆ సినిమాకు మక్కీకి మక్కీ కాపీగా 'శంకర్‌దాదా జిందాబాద్' కనిపిస్తుంది. కాకపోతే మెగాస్టార్ బ్రాండ్ కామెడీ ఈ సినిమాకు ఓ ఆకర్షణ. ఆయన స్టైల్, ఆయన గ్రేస్, కలర్‌ఫుల్ డాన్సులు ఈ సినిమాలో కనిపిస్తాయి. 2007 జూలై 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



