ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ బంద్.. అనౌన్స్ చేసిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్!
on Jul 27, 2022

ఆగస్ట్ 1 నుంచి తమ సినిమాల షూటింగ్‌లను నిలిపివేయాలని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) సంచలన నిర్ణయం తీసుకుంది. గిల్డ్‌లోని సభ్యులందరూ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. సి. అశ్వినీదత్, అల్లు అరవింద్, డి. సురేశ్‌బాబు, దిల్ రాజు, స్రవంతి రవికిశోర్, డీవీవీ దానయ్య, అనిల్ సుంకర, వై. రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ లాంటి ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాతల్లో పలువురు ఈ గిల్డ్‌లో సభ్యులు కావడం గమనార్హం. ఇండస్ట్రీకి ప్రాతినిధ్యం వహించే తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సమాంతరంగా వీరు ఈ గిల్డ్‌ను ఏర్పాటుచేశారు.
"మహమ్మారి తర్వాత ఆర్థిక పరిస్థితులు, పెరిగిన ధరల నేపథ్యంలో ఫిల్మ్‌మేకర్స్ కమ్యూనిటీగా మేం ఎదుర్కొంటున్న అన్ని సాధకబాధకాలను చర్చించడం నిర్మాతలకు చాలా ముఖ్యమైందిగా మారింది. మన (ఇండస్ట్రీ) పర్యావరణ వ్యవస్థను మెరుగుపర్చుకోవడం మన బాధ్యత. ఆరోగ్యకరమైన వాతావరణంలో మన చిత్రాలను విడుదల చేసుకోవాల్సి ఉంది. ఈ విషయమై, ఆగస్ట్ 1 నుంచి షూటింగ్‌లను నిలిపి వేయాలని గిల్డ్‌లోని సభ్య నిర్మాతలందరూ స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. పనిచేయడానికి తగ్గ సానుకూల పరిష్కారాలను కనిపెట్టేదాకా చర్చలు కొనసాగిస్తుంటాం." అని గిల్డ్ ఓ ప్రకటనను వెలువరించింది.
కాగా గిల్డ్‌లోని 13 మంది సభ్యులు నిర్మాతల మండలిలోనూ సభ్యులు కావడం గమనార్హం. గిల్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈరోజు నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటుచేసి, పరిస్థితిని చర్చించనుంది. కార్మికుల వేతనాలను పెంచకపోతే, సమ్మె చేస్తామని ఇదివరకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ హెచ్చరించగా, ఇప్పుడు తామే షూటింగ్స్‌ను బంద్ పెడతామని అగ్ర నిర్మాతలు తాఖీదు పంపడం ఇండస్ట్రీలో ఘర్షణ వాతావరణాన్ని నెలకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. గిల్డ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకువచ్చిందో ఈరోజు నిర్మాతల మండలి సమావేశంలో చర్చించి, తగిన నిర్ణయం తీసుకుంటామని మండలి బాధ్యులు ఒకరు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



