సినిమా ఛాన్స్ ఇప్పిస్తామని మైనర్‌పై లైంగిక దాడి.. ఆందోళనలో చిత్ర పరిశ్రమ
on Dec 3, 2025
సినిమాల మీద ఆసక్తితో ఎంతో మంది చిత్ర పరిశ్రమలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తుంటారు. అయితే వారికి సినిమాల్లో అవకాశాలు రాకపోగా ఎక్కువ శాతం మోసపోతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎక్కువగా బలవుతున్నారు. ఇప్పటికే క్యాస్టింగ్‌కౌచ్ పేరుతో మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి సంబంధించిన ఘటనలు ఒక్కొక్కటిగా బయటికి వస్తూనే ఉన్నాయి. సినిమాల్లో నటించాలని కోరిక ఉన్న అమ్మాయిల పాలిట క్యాస్టింగ్ కౌచ్ ఓ మహమ్మారిగా మారింది.
ఇప్పటికే ఇలాంటి కథలు చాలా వెలుగులోకి వచ్చాయి. దోషులను కటకటాల వెనక్కి పంపారు కూడా. అయినా ఇది ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో క్యాస్టింగ్ కౌచ్‌కి సంబంధించిన ఫిర్యాదు అందింది. అది కూడా ఒక మైనర్ బాలిక ఇవ్వడం పరిశ్రమ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మబలికి అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి, అకౌంటెంట్ అనిల్ ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒక మైనర్ బాలికపై చాలా కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమా ఇండిస్టీలో తమకు బాగా పలుకుబడి ఉందని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి వారిద్దరూ పదే పదే ఆమెను శారీరకంగా వేధిస్తున్నారని తెలిసింది.
సినిమాల్లో నటించాలన్న తన ఆశను, బలహీనతను ఆసరాగా చేసుకొని తనపై లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఈ విషయం బయట పడుతుందనే కారణంతో ఆమెను పలుమార్లు బెదిరించారట. వారి దారుణాలను ఎంతో ఓపికగా భరించిన ఆ బాలిక చివరికి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు శివారెడ్డి, అనీల్‌లపై కేసు నమోదు చేసి, పిఓసిఎస్‌ఓ చట్టం కింద వారిద్దరినీ అరెస్ట్ చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై చర్య తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



