సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి!
on Dec 14, 2023
సినీ ప్రముఖుల వరస మరణాలు సినిమా పరిశ్రమలో విషాదాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మరణవార్త కోలీవుడ్‌లో చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, దర్శకుడు రామరత్నం శంకరన్(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని దర్శకుడు భారతీరాజా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. రామరత్నం శంకరన్ 1931లో తమిళనాడులో జన్మించారు. సినిమాలపై ఉన్న మక్కువతో మద్రాసులో అడుగుపెట్టిన రామరత్నం పలువురు దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి 8 సినిమాలకు దర్శకత్వం వహించారు. 1974లో వచ్చిన ‘ఒన్నె ఒన్ను కన్నె కన్ను’ చిత్రం దర్శకుడిగా ఆయన తొలి చిత్రం. ఆయన దర్శకత్వం వహించిన చివరి చిత్రం 1980లో వచ్చిన ‘కుమారి పెన్నిన్ ఉల్లతిలే’. ఆ తర్వాత దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. ఆ తర్వాత నటుడిగా కొనసాగారు. 1977లో వచ్చిన ‘పెరుమైక్కురియవల్’ ఆయన నటించిన తొలి చిత్రం. ఎన్నో చిత్రాల్లో తండ్రిగా, ఇంటికి పెద్దగా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. మణిరత్నం దర్శకత్వం వహించిన ‘మౌనరాగం’ చిత్రంలో రేవతి తండ్రిగా నటించారు. దర్శకుడుగా ఆయన 8 సినిమాలు చేశారు. 50కి పైగా సినిమాల్లో వివిధ క్యారెక్టర్లు చేశారు. అయితే ఇవన్నీ తమిళ సినిమాలే. ఒక్కటి కూడా పరభాషా చిత్రం లేకపోవడం విశేషం.
రామరత్నం శంకరన్ మృతి పట్ల భారతీరాజా స్పందిస్తూ ‘నాకు రామరత్నం శంకరన్ గురు సమానులు. ఆయన మరణం నన్ను కలచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రామరత్నం శంకరన్ మృతి పట్ల పలువురు కోలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



