షాకింగ్ రోల్‌లో రాజేంద్రప్రసాద్.. ఉద్వేగభరితంగా 'సేనాపతి' ట్రైలర్!
on Dec 29, 2021

"ఇదేంటో తెలుసా? సేనాపతి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి" అంటున్నారు రాజేంద్రప్రసాద్. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'సేనాపతి'. డిసెంబర్ 31న ఆహా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు. 'రాజుకా? రాజ్యానికా?' అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. 'ప్రేమ ఇష్క్ కాదల్' ఫేమ్ పవన్ సాదినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నరేశ్ అగస్త్య, హర్షవర్ధన్, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, సత్యప్రకాశ్, రాకేందు మౌళి, రవి జోష్, పావని రెడ్డి కీలక పాత్రధారులు. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల, ఆమె భర్త విష్ణు ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు.
ట్రైలర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్మాణ సంస్థ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, "మీరు అడ్డుచెప్పలేని థ్రిల్లర్. #SenapathiOnAha ట్రైలర్ రిలీజయ్యింది. నటకిరీటి రాజేంద్రప్రసాద్ మొదటి ఓటీటీ వెంచర్‌లో ఒక భాగమైనందుకు గర్వంగా ఉంది. ఆహాలో డిసెంబర్ 31న ప్రీమియర్ అవుతోంది." అని రాసుకొచ్చింది.
'సేనాపతి' ట్రైలర్‌లో రాజేంద్ర ప్రసాద్ ఒక కామన్‌మ్యాన్ పాత్రలో కనిపించారు. దాదాపు రెండు నిమిషాల ట్రైలర్లో ఒక పోలీసు తన ఆయుధాన్ని పోగొట్టుకోవడం, దుర్మార్గుల నుండి దానిని తిరిగి పొందే ప్రయత్నంలో అతని పోరాటంతో ప్రారంభమవుతుంది. మంచి చెడుల కాన్సెప్ట్‌ని పరిచయం చేసినప్పటికీ, సినిమా కథాంశం గురించి, రాజేంద్ర ప్రసాద్ పాత్రకూ, పోలీసులకూ సంబంధమేంటి అనే దాని గురించి పెద్దగా చెప్పలేదు. అయితే ఆయన క్యారెక్టర్‌లో షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది. మొత్తంగా 'సేనాపతి' అనేది ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అనే అభిప్రాయాన్ని ట్రైలర్ కలిగిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



