కానిస్టేబుల్ 'సెబాస్టియన్'కి రేచీకటి.. దేవుడి బిడ్డ కాదన్నమాట!
on Feb 5, 2022

'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హ్యాట్రిక్ పై కన్నేశాడు. మొదటి రెండు సినిమాలతో మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్న కిరణ్.. మూడో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. కిరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సెబాస్టియన్ పిసి 524'. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి, రాజు, ప్రమోద్ ఈ సినిమాని నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
'నీకు రేచీకటి (నైట్ బ్లైండ్‌నెస్) అన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వొద్దయ్యా!' అని తల్లి చెప్పే మాటతో 'సెబాస్టియన్ పిసి524' టీజర్ మొదలైంది. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్ సెబాస్టియన్ పాత్రలో జాకీ చాన్ స్టయిల్‌లో కిరణ్ ఎంట్రీ ఇచ్చాడు. రేచీకటి గల హీరో నైట్ డ్యూటీ ఎలా చేశాడన్నది ఆసక్తికరంగా ఉంది. 'దయగల ప్రభువా... ఈ రాత్రి మదనపల్లి పట్టణ ప్రజలకు ఏ ఇబ్బందీ రాకుండా చూడు తండ్రి. నీకు స్తోత్రం', 'ప్రభువా... ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు', 'నేను దేవుడి బిడ్డను కాదన్నమాట' అని హీరో చెప్పే డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. మొత్తం మీద సినిమాపై టీజర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టీజర్ చూస్తే కిరణ్ హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం ఖాయమనిపిస్తోంది.
'సెబాస్టియన్ పిసి524'లో కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



