'మూడు ముళ్లు' ఒరిజినల్‌కు రీమేక్ వస్తోంది!
on May 20, 2020
కాలీవుడ్‌లో సీక్వెల్స్, రీమేక్‌లకు గిరాకీ పెరిగింది. కమల్ హాసన్ మూవీ 'దేవర్ మగన్'ను రీమేక్ చేయనున్నారని కొద్ది రోజుల క్రితం వార్తలు రాగా, తాజాగా ఎవరూ ఊహించని విధంగా కె. భాగ్యరాజ్ మూవీ 'ముందనై ముడిచ్చు' (1983)ను మళ్లీ తీయనున్నారనే విషయం వెల్లడైంది. ఈ రీమేక్‌లో శశికుమార్ హీరోగా నటించనున్నాడు. ఈ రీమేక్ గురించి భాగ్యరాజ్, శశికుమార్ మధ్య చర్చలు జరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
హీరోగా నటిస్తూ, కె. భాగ్యరాజ్ డైరెక్ట్ చేసిన 'ముందనై ముడిచ్చు' మూవీ సూపర్ హిట్టయింది. తెలుగులో చంద్రమోహన్ హీరోగా జంధ్యాల డైరెక్షన్‌లో 'మూడు ముళ్లు' పేరుతో రీమేక్ అయి, ఇక్కడా మంచి విజయం సాధించింది. తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళం భాషల్లోనూ ఈ సినిమా రీమేడ్ అవడం గమనార్హం. 'ముందనై ముడిచ్చు' ద్వారానే నటి ఊర్వశి హీరోయిన్‌గా పరిచయమై ఆకట్టుకున్నారు. ఈ సినిమా విడుదలై 37 సంవత్సరాలు గడిచాక, రీమేక్ న్యూస్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ రీమేక్‌కు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను భాగ్యరాజ్ సమకూర్చనుండగా, బాలాజీ బాల్‌రాజ్ దర్శకుడిగా పరిచయమవనున్నాడు. తమిళ సినీ రంగంలో విమర్శకులు మెచ్చిన నటుడిగా పేరు తెచ్చుకున్న శశికుమార్ ఈ సినిమాకు న్యాయం చేస్తాడని భావిస్తున్నారు. తమిళంలో మరోసారి రూపొందుతున్న ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ అవుతుందా? చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
