'సప్త సాగరాలు దాటి' మూవీ రివ్యూ.. హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ
on Sep 22, 2023
'అతడే శ్రీమన్నారాయణ', '777 చార్లీ' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన కన్నడ చిత్రం 'సప్త సాగర దాచే ఎల్లో'. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్. సెప్టెంబర్ 1న కన్నడలో విడుదలైన ఈ మూవీ క్లాసిక్ లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
'సప్త సాగరాలు దాటి' కథ విషయానికొస్తే.. క్యాబ్ డ్రైవర్ మను(రక్షిత్ శెట్టి), సింగర్ కావాలని కలలు కనే కాలేజ్ స్టూడెంట్ ప్రియ(రుక్మిణి వసంత్) గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమ వీరిది. కలిసి బతకాలని కోరుకుంటూ, అందమైన భవిష్యత్ కోసం కలలు కంటారు. ఎప్పటికైనా ప్రియ సొంత ఊరిలో సముద్రం దగ్గర ఓ ఇంటిని కట్టుకొని, అందులో ఉండాలని అనుకుంటారు. కానీ మను తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం వారి జీవితాలను మార్చేస్తుంది. ఏంటా నిర్ణయం? ఆ నిర్ణయం వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అనేది మిగిలిన కథ.
దర్శకుడు ఓ చిన్న కథని తీసుకొని, దానిని పొయెటిక్ గా ఎంతో అందంగా మలిచాడు. కథని నడిపిన విధానం, పాత్రలను మలిచిన తీరు ఆకట్టుకున్నాయి. బ్యూటిఫుల్ సీన్స్, ఎమోషన్స్ తో సినిమా ఆకట్టుకునేలా ఉంది. అసలు కథలోకి వెళ్ళడానికి దర్శకుడు కాస్త సమయం తీసుకున్నప్పటికీ, ద్వితీయార్థంలో భావోద్వేగాలతో కట్టిపడేసాడు. సినిమా కవితాత్మకంగా ఉంది. అడుగడుగునా దర్శకుడి ప్రతిభ కనిపించింది. అయితే కమర్షియల్ సినిమా ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు. నెమ్మదిగా సాగే కథనం విసుగు తెప్పించవచ్చు. ఇక ఈ సినిమాకి సాంకేతిక విభాగాలు కూడా పోటీపడి పనిచేశాయి. ముఖ్యంగా అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ, చరణ్ రాజ్ సంగీతం ప్రధాన బలంగా నిలిచాయి. ఎడిటింగ్ కూడా నీట్ గా ఉంది. కానీ కొన్ని చోట్ల కాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.
చివరగా..
కథనం నెమ్మదిగా సాగినప్పటికీ, భావోద్వేగాలతో కూడిన సున్నితమైన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
