'కశ్మీర్ ఫైల్స్' గురించి మాట్లాడి.. వివాదంలో చిక్కుకున్న సాయిపల్లవి!
on Jun 15, 2022

సాయిపల్లవి అనుకోని వివాదంలో చిక్కుకుంది. హింస గురించి వచ్చిన చర్చలో 'కశ్మీర్ ఫైల్స్' సినిమాలో కశ్మీరీ పండిట్లను మరో మతానికి చెందినవాళ్లు చంపే ఘటనకూ, కరోనా టైమ్‌లో ఒక వెహికల్‌లో ఆవును తరలిస్తున్న ముస్లిం వ్యక్తిని కొట్టి, జై శ్రీరామ్ అనమని కొంతమంది బలవంతపెట్టిన ఉదంతానికి ముడిపెట్టి.. రెండింటిలోనూ మతపరమైన హింస ఉందని చెప్పడం వివాదానికి దారితీసింది. ఈ విషయంపై ఇప్పుడు రైటిస్టులు, వారి వ్యతిరేకులు సోషల్ మీడియా వేదికగా వాదులాట మొదలుపెట్టేశారు. రెండూ ఘటనలనూ ఒకే గాటన ముడిపెడతావా? అని సాయిపల్లవిని రైటిస్టులు తెగనాడుతుంటే, ఆమె సరిగ్గానే చెప్పిందంటూ, కావాలని ఆమె చెప్పిన విషయాన్ని తమకు అనుకూలంగా మలచుకొని రాద్ధాంతం చేస్తున్నారనీ కొంతమంది ఆమెకు మద్దతు పలుకుతున్నారు.
సాయిపల్లవి హీరోయిన్‌గా నటించిన 'విరాటపర్వం' మూవీ ఈనెల 17న విడుదలవుతోంది. రవన్న అనే నక్సలైట్‌గా రానా దగ్గుబాటి ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాకు వేణు ఊడుగుల దర్శకుడు. ఆ సినిమా ప్రమోషనల్‌లో భాగంగా ఆమె ఇచ్చిన ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.
"హింస అంటే రాంగ్ ఫామ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని నా ఫీలింగ్. వయొలెంట్‌గా ఉంటే ఇది సాధించగలుగుతాం అని ఇప్పుడు నేను ఆలోచించను. నక్సలెట్ల కాలంలోని హింసను అర్థం చేసుకోవడం నాకు చాలా కష్టం. వాళ్లు చేసింది కరక్టా, కాదా అనేది చెప్పడం కష్టం. ఇది చేస్తేనే తమకు కావాల్సింది దక్కుతుందని నమ్మి వారు హింసను అనుసరించారు. నేను పెరిగింది చాలా తటస్థ వాతావరణంలో. లెఫ్టిస్ట్ ఫ్యామిలీలో కానీ, రైటిస్ట్ ఫ్యామిలీలో కానీ నేను పుట్టినట్లయితే నేను ఎవరికో ఒకరివైపుకి ఫేవర్ చేసుంటానేమో. నేను చాలా న్యూట్రల్ ఫ్యామిలీలో పెరిగాను. నువ్వు మంచి మనిషిగా ఉండు అని చెప్పే ఫ్యామిలీలో పెరిగాను." అని తెలిపింది సాయిపల్లవి.
"ఎవరైతే హింసకు గురవుతుంటారో వాళ్లను ఆదుకోమని చెప్తుంటారు మావాళ్లు. నేను లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నాను. ఎవరు తప్పు, ఎవరె కరెక్ట్ అని మనం ఎప్పుడు చెప్పగలం? ఇటీవల 'కశ్మీర్ ఫైల్స్' సినిమా వచ్చింది. అప్పట్లో కశ్మీరీ పండిట్లను ఎట్లా చంపారో అందులో చూపించారు. ఒక రెలిజియస్ కాన్‌ప్లిక్ట్ లాగా తీసుకుంటే, కొవిడ్ టైమ్‌లో ఎవరో బండిలో ఆవును తీసుకెళ్తున్నారని ఆ బండి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ముస్లిం అని అతడ్ని కొట్టి జై శ్రీరామ్ అనమని చెప్పారు. అప్పుడు జరిగిన దానికీ, ఇప్పుడు జరిగిన దానికీ డిఫరెన్స్ ఏముంది? మనం మనిషిగా, మంచి వ్యక్తిగా ఉండుంటే మనం ఎవర్నీ బాధపెట్టం, ఒక మనిషిపై ఒత్తిడి చేయం. మీరు మంచి మనిషి కాకపోతే లెఫ్ట్ అయినా, రైట్ అయినా న్యాయం ఉండదు. మంచి మనిషిగా ఉంటే మీరెక్కడ ఉన్నా తటస్థంగా ఉండిపోతారు" అని ఆమె చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



