నార్త్ వాళ్లకు.. యష్ మామూలుగా ఇవ్వలేదుగా!
on Nov 8, 2022

రాకీ భాయ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎవరికీ భయపడడు. ఎలాంటి వాళ్లకైనా ఎదురెళ్తాడు... ఇవన్నీ జస్ట్ 'కేజీయఫ్1' అండ్ 'కేజీయఫ్ చాప్టర్2'లోనే అనుకుంటే పొరబడినట్టే. రియల్ లైఫ్ లోనూ పంచులు పేలుస్తున్నారు యష్. తన మనసులో ఎప్పటెప్పటి నుంచో గూడుకట్టుకుని ఉన్న విషయాలను ఇప్పుడు బయట పెడుతున్నారు. దక్షిణాది సినిమాలు ఉత్తరాదిన ఢంకా భజాయిస్తున్న ఈ టైమ్‌లో ఒకప్పుడు నార్త్ వాళ్లు మన సినిమాలను ఎలా చూసేవారో తన మనసులోని మాటల్ని ఓపెన్‌గా చెప్పేశారు యష్. ఇప్పుడే కాదు, పదేళ్ల క్రితం కూడా మన సినిమాలు నార్త్ లో అనువాదమయ్యేవి. మన సినిమాలను చూసి నార్త్ వాళ్లు అరే ఇదేం యాక్షన్.. అందరూ గాల్లో ఎగురుతున్నారు అని ఎగతాళి చేసేవారట. ఇప్పుడు దక్షిణాది సినిమాలను ఉత్తరాది వాళ్లు చూస్తున్న తీరుకు, అప్పట్లో చూసిన తీరుకూ చాలా చాలా తేడా ఉందని అంటున్నారు యష్.
తర్వాత కాలంలో జనాలు దక్షిణాది సినిమాలను అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. "అయినా వాళ్లు తప్పుగా అర్థం చేసుకోవడానికి ఒక కారణం ఉంది.. దక్షిణాది సినిమాల హిందీ రైట్స్ ని అప్పట్లో చాలా తక్కువ డబ్బులు చెల్లించి కొనుగోలు చేసేవారు. పైగా వాటిని నాసిరకంగా డబ్బింగ్ చేసేవారు. ఫన్నీ పేర్లతో, స్థాయి తగ్గించి ప్రచారం చేసి అమ్మేవారు" అంటూ అసలు రీజన్ ఏంటో కూడా చెప్పేశారు యష్.
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి', ప్రశాంత్ నీల్ 'కేజీయఫ్' రిలీజ్ అయిన తర్వాతనే దక్షిణాది సినిమాల మీద ఉత్తరాది వారి అభిప్రాయం మారిందని అన్నారు యష్. "నార్త్, సౌత్ అనే సరిహద్దులను చెరిపేసిన ఘనత ఎప్పటికీ 'బాహుబలి'దే. దాని దారిలో మా 'కేజీయఫ్' నడిచింది. ఇక ఇప్పుడు అందరూ కలిసి సినిమాలు చేస్తే ఇప్పటి హయ్యస్ట్ కలెక్షన్లకు వంద రెట్లు ఎక్కువ నెంబర్స్ చూడొచ్చు" అని అన్నారు యష్. 'కేజీయఫ్ 3' ఇప్పట్లో స్టార్ట్ కాదని, తాను ఇంకో భారీ ప్రయత్నం చేస్తున్నాననీ తెలిపారు రాకీభాయ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



