చంద్ర సిద్దార్థ సోదరుడు... దర్శకుడు, ఛాయాగ్రాహకుడు రాజేంద్ర ప్రసాద్ ఇకలేరు
on Aug 19, 2022

ప్రముఖ ఛాయాగ్రాహకులు, దర్శక - నిర్మాత రాజేంద్ర ప్రసాద్ నేడు తుదిశ్వాస విడిచారు. విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న 'ఆ నలుగురు' సహా తెలుగు చిత్రాలు తీసిన దర్శకులు చంద్ర సిద్ధార్థకు ఈయన సోదరుడు. వివిధ భారతీయ భాషల్లో రూపొందిన చిత్రాలతో పాటు పర్షియల్ భాషా చిత్రాలకు కూడా ఆయన పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీల్లో చదువుకున్నారు. 1995లో సొంత నిర్మాణ సంస్థ 'అమెచ్యూర్ ఆర్టిస్ట్స్'ను ఆయన నెలకొల్పారు.
తెలుగు సినిమా 'నిరంతరం' (1995)కు రాజేంద్ర ప్రసాద్ దర్శక నిర్మాత, రచయిత. 'నిరంతరం' సినిమా మలేషియాలోని కైరో చలన చిత్రోత్సవాలకు ఎంపిక అయ్యింది. పలువురి ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్‌లో 'మ్యాన్ విమన్ అండ్ ది మౌస్', 'రెస్డ్యూ - వేర్ ది ట్రూత్ లైస్' 'ఆల్ లైట్స్, నో స్టార్స్' చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ ఆయనే సినిమాటోగ్రఫీ, రైటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగులో 'మేఘం', 'హీరో' సహా పలు చిత్రాలకు రాజేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా సేవలు అందించారు. హిందీ సినిమాలు కూడా చేశారు. రాజేంద్ర ప్రసాద్ ముంబైలో స్థిరపడ్డారు. ఆయన మృతి పట్ల చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



