ENGLISH | TELUGU  

'తీస్ మార్ ఖాన్' మూవీ రివ్యూ

on Aug 19, 2022

 

సినిమా పేరు: తీస్ మార్ ఖాన్
తారాగ‌ణం: ఆది సాయి కుమార్, పాయల్ రాజ్ పుత్, పూర్ణ, సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, శ్రీకాంత్ అయ్యంగార్, కబీర్ సింగ్
మ్యూజిక్: సాయి కార్తీక్
సినిమాటోగ్ర‌ఫీ: ఎం.ఎల్. బాల్ రెడ్డి
ఎడిటింగ్: మణికాంత్
నిర్మాత: నాగం తిరుపతి రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: కళ్యాణ్ జి గోగణ
బ్యాన‌ర్: విజన్ సినిమాస్
విడుద‌ల తేదీ: 19 ఆగ‌స్ట్ 2022

 

అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన 'ప్రేమ కావాలి'(2011), 'లవ్ లీ'(2012) తర్వాత హీరో ఆది సాయి కుమార్ ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు నమోదు కాలేదు. దాదాపు పదేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న ఆది తాజాగా 'తీస్ మార్ ఖాన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా.. పూర్ణ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రమైనా ఆది పరాజయాల పరంపరకు బ్రేక్ వేస్తుందో లేదో రివ్యూలో చూద్దాం.

 

కథ:
వ్యాపారాల పేరుతో అక్రమాలు చేస్తూ కోట్లు సంపాదించే జీజా(అనూప్ సింగ్ ఠాకూర్) తనకు అడ్డొచ్చిన వాళ్ళని చంపడమో లేదా కనిపించకుండా చేయడమో చేస్తుంటాడు. తన అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని చూసిన హోమ్ మినిస్టర్(శ్రీకాంత్ అయ్యంగార్)నే చావు అంచుల వరకు తీసుకెళ్తాడు. అలాంటి జీజా జీవితంలోకి 'తీస్ మార్ ఖాన్'(ఆది) అనే ఒక సాధారణ వ్యక్తి ఎంటర్ అవుతాడు. తన మనుషులను 'తీస్ మార్ ఖాన్' కొట్టడంతో ఏకంగా అతను తల్లిలా భావించే వసు(పూర్ణ)ను జీజా చంపిస్తాడు. అసలు ఆమెని చంపడానికి కారణమేంటి? జీజా వెనకుంది ఎవరు? ఏ బ్యాక్ గ్రౌండ్ లేని 'తీస్ మార్ ఖాన్' పోలీస్ గా మారి జీజాని ఎలా ఢీ కొట్టాడు? జీజాను మట్టుపెట్టే క్రమంలో అతను తెలుసుకున్న సంచలన విషయాలేంటి? తెలియాలంటే సినిమా చూడాలి.

 

ఎనాలసిస్:
ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారిపోయింది. ఒక చిన్న పాయింట్  అనుకొని, దాని చుట్టూ ఏదో కథ అల్లుకొని ఓ రెండు గంటలు టైమ్ పాస్ చేస్తే ఆదరించే రోజులు కావివి. కానీ ఇంకా కొందరు హీరోలు, దర్శకనిర్మాతల తీరు మారట్లేదు. ఏ మాత్రం ఆసక్తికరంగా లేని రొటీన్ సినిమాలు తీసి చేతులు కాల్చుకుంటున్నారు. ఆ కోవలోకే 'తీస్ మార్ ఖాన్' కూడా వస్తుంది. తన తోటి హీరోలు నిఖిల్, అడివి శేష్ వంటి వారు విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తుంటే.. ఆది మాత్రం ఆ రొటీన్ ఫార్మాట్ లోనుంచి బయటకు రాలేకపోతున్నాడు. సినిమాల కౌంట్ కంటే, కాస్త ఆలస్యమైనా కంటెంట్ ఉన్న సినిమాలు తీయడం మంచిదని ఇప్పటికైనా అతను గ్రహిస్తే బెటర్.

 

ఈరోజుల్లో కమర్షియల్ సినిమా తీసి ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. కథ కొత్తగా ఉండాలి, కథనం ఆసక్తికరంగా సాగాలి. లేదంటే ప్రేక్షకుల ఆదరణ కష్టమే. 'తీస్ మార్ ఖాన్' స్టార్టింగ్ నుంచి సెకండాఫ్ సగం వరకు చాలా రొటీన్ గా సాగిపోతుంది. చిన్నప్పుడు తల్లి ఆదరణకు నోచుకోని హీరో.. తన కడుపు నింపి అమ్మలా ప్రేమను పంచిందన్న కారణంతో అక్క వయసున్న ఆమెను సొంత తల్లిలా భావిస్తాడు. ఆమెని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఆ ఆలోచన బాగానే ఉంది కానీ, ఆ ఇద్దరి మధ్య బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అలాగే ఆది, పాయల్ మధ్య లవ్ ట్రాక్ కానీ.. హీరో, విలన్ మధ్య సన్నివేశాలు కానీ ఆసక్తికరంగా లేవు. ఫస్టాఫ్ చాలా సాదాసీదాగా సాగిపోయింది.

 

ఫస్టాఫ్ తో పోల్చితే సెకండాఫ్ కాస్త బెటర్ గా అనిపించింది. రెండు ట్విస్ట్ లతో కథ కాస్త మలుపు తిరుగుతుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా కేవలం రెండు ట్విస్ట్ లతో సినిమా నడవదు. రెండు గంటల పాటు ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేయగల కథాకథనాలు ఉండాలి. నిజానికి ఇందులో మృతదేహాల దహనం తర్వాత వచ్చే బూడిద నుంచి తయారు చేసే 'మెమోరియల్ డైమండ్' అనే ఒక కొత్త పాయింట్ ఉంది. కానీ దానిని కేవలం మాటల రూపంలో ఒక నిమిషంలో చెప్పేసి, మిగతా అంతా రొటీన్ కథనాన్ని అల్లుకున్నారు. అలా కాకుండా 'మెమోరియల్ డైమండ్' పాయింట్ ని ప్రధానంగా తీసుకొని, కథనాన్ని ఆసక్తికరంగా మలిచి ఉంటే అంతో ఇంతో బాగుండేదేమో.

 

టెక్నికల్ గా సినిమా కాస్త బెటర్ గానే ఉన్నా.. కథాకథనాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా పర్లేదు అనిపించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్.. సాంగ్స్ తో మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా హమ్ చేసుకునేలా లేవు. స్పెషల్ సాంగ్ సైతం మెప్పించలేకపోయింది. ఎం.ఎల్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది.

 

నటీనటుల పనితీరు:
'తీస్ మార్ ఖాన్' పాత్రలో ఆది ఆకట్టుకున్నాడు. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో మెప్పించాడు. అయితే ఈ పాత్ర తన నటనా ప్రతిభను నిరూపించుకోవడానికి కానీ, తన కెరీర్ ని మరో మెట్టు ఎక్కించడానికి కానీ ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఇక పాయల్ కేవలం కొన్ని సీన్లు, గ్లామర్ షోకే పరిమితమైంది. ఆ పాత్రతో సినిమాకి గానీ, ఆమెకి గానీ ఒరిగిందేమి లేదు. ఆది తల్లి లాంటి పాత్రలో పూర్ణ ఉన్నంతలో మెప్పించింది. పూర్ణ భర్త చక్రి పాత్రలో సునీల్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కీలక సన్నివేశంలో సునీల్ నటన కట్టిపడేసింది. హోమ్ మిస్టర్ గా శ్రీకాంత్ అయ్యంగార్, జీజాగా అనూప్ సింగ్ ఠాకూర్, తల్వార్ గా కబీర్ సింగ్ పాత్రల పరిధి మేరకు రాణించారు.

 

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ-2' వంటి విభిన్న చిత్రాలను కోరుకుంటున్న ప్రేక్షకులు 'తీస్ మార్ ఖాన్' లాంటి రొటీన్ కమర్షియల్ సినిమాని ఆదరించడం కష్టమే. చాలా కాలంగా సరైన విజయం కోసం చూస్తున్న ఆది ఎదురుచూపులకి 'తీస్ మార్ ఖాన్'తో తెర పడలేదనే చెప్పాలి.

 

రేటింగ్: 2/5 

-గంగసాని

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.