వివాదాస్పద కథతో రవితేజ సినిమా.. రాజకీయ దుమారమేనా!
on Jul 11, 2023

డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన ఇటీవల వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథకి సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇది చుండూరు ఊచకోత నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా అని ప్రచారం జరుగుతోంది.
1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో కొందరు అగ్రకులస్తులు దళితవాడపై దాడి చేసి దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆ ఘటనను ఆధారంగా చేసుకొని ఓ సినిమా రాబోతుందనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రవితేజ, గోపీచంద్ నాలుగో సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ మారణ కాండను ప్రతిబింబిస్తోంది. పైగా పోస్టర్ లో చుండూరు బోర్డుతో పాటు, డేంజర్ బోర్డుని చూడవచ్చు. అంటే అనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే ఇది చుండూరు హత్యాకాండ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా అని హింట్ ఇచ్చినట్లు ఉంది. ఈ హత్యాకాండ వెనుక ప్రస్తుత రాజకీయాల్లో కీలకంగా ఉన్న రెండు అగ్ర కులాలకు చెందివారు ఉన్నారని అంటారు. దీంతో ఈ సినిమా రాజకీయంగా ఎలాంటి దుమారం రేపుతుందోనన్న ఆసక్తి నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



