Home

»

Latest News

ఒసేయ్ రాములమ్మ సాంగ్: రష్మిక రౌద్రరూపం.. విజయశాంతి మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా.?

Nov 21, 2026 3:02PM

1997లో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా తెలుగు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌లోని విప్లవ భావాలు, తెలంగాణ జానపద శైలి ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి ఐకానిక్ పాటను ఇప్పుడు రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ కోసం రీక్రియేట్ చేశారు.

ఈ పాటలో మొదటగా ఆకట్టుకునేది రష్మిక కనిపించిన తీరు. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఆమె.. ఇందులో మాత్రం పూర్తి భిన్నమైన రౌద్రరూపంలో కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలు, చుట్టూ అడవి వాతావరణం, యాక్షన్ విజువల్స్‌తో ఆమె పాత్రలోని తెగువను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రష్మిక లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి.

మరోవైపు ఒరిజినల్ పాటలో ఉన్న విప్లవ స్ఫూర్తిని కొత్త వెర్షన్‌లోనూ కొనసాగించే ప్రయత్నం కనిపిస్తోంది. విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర అప్పట్లో అణచివేతకు ఎదురొడ్డి నిలిచే మహిళగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ‘మైసా’లోనూ రష్మిక గిరిజన మహిళ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ రెండు పాటల మధ్య ఓ భావోద్వేగపరమైన అనుసంధానం ఏర్పడింది. అందుకే ఇది సాధారణ రీమిక్స్‌లా కాకుండా ఓ ప్రత్యేకమైన నివాళిగా నిలవాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది.

సంగీతం విషయానికి వస్తే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్ మరోసారి తన గొంతుతో ఈ పాటను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణ. సుద్దాల అశోక్ తేజ కొత్త సాహిత్యాన్ని అందించగా, జేక్స్ బిజోయ్ తనదైన సంగీతంతో పాటకు కొత్త రూపం ఇచ్చారు. పాత పాటను యథాతథంగా అనుకరించకుండా, ‘మైసా’ కథానాయిక స్వభావానికి తగ్గట్టుగా కొత్త బీట్, కొత్త ఎనర్జీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

ఇది కూడా చదవండి: పండగ పాట వచ్చేసింది.. హీరోయిన్లు ఒక ఊపు ఊపేశారు.!

అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఒరిజినల్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో ప్రేక్షకులకు ఉన్న అనుబంధం చాలా బలమైనది. అలాంటి పాటను మళ్లీ రూపొందించడం అంటే సహజంగానే పోలికలు వస్తాయి. విజయశాంతి సృష్టించిన ప్రభావాన్ని రష్మిక అందుకోగలదా? అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఈ విషయంపై రష్మిక స్వయంగా స్పందిస్తూ, అంతటి ఐకానిక్ పాటను మళ్లీ చేయాలంటే మొదట భయమేసిందని, ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేమని, అయితే దానికి న్యాయం చేసే ప్రయత్నం చేశామని చెప్పింది. విజయశాంతికి ఇది తమ చిన్న నివాళి అని కూడా పేర్కొంది.

మొత్తానికి ‘ఒసేయ్ రాములమ్మ’ పాట ‘మైసా’పై అంచనాలను పెంచేలా ఉంది. ఒకవైపు పాత పాటను గుర్తు చేసే నాస్టాల్జియా.. మరోవైపు రష్మిక కొత్త అవతార్.. ఈ రెండింటినీ కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 

మీకు నచ్చవచ్చు: 
టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా!
సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.?

 

 

 

[Mysaa Movie, Osey Ramulamma Song, Rashmika Mandanna, Vijayashanthi, Vandemataram Srinivas]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com