ఈ సారి చరణ్ ని టార్గెట్ చేసిన శంకర్?
on Apr 20, 2021
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ చిత్రాల్లో కథానాయకులు రెండేసి పాత్రల్లో కనిపించడం కొత్తేమీ కాదు. `ఇండియన్` (భారతీయుడు)లో లోకనాయకుడు కమల్ హాసన్, `జీన్స్`లో ప్రశాంత్, `ఎందిరన్` (రోబో) - `2.0` చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్.. ద్విపాత్రాభినయం చేసి అలరించారు. కట్ చేస్తే.. తన రాబోయే చిత్రంలోనూ శంకర్ ఇదే శైలిని కొనసాగించబోతున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో పట్టాలెక్కనుంది. కాగా, ఈ చిత్రంలో చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారని వినికిడి. అంతేకాదు.. కథానుసారం 60 ఏళ్ళ వృద్ధుడి గెటప్ లోనూ చరణ్ దర్శనమివ్వనున్నారట. మరి.. ఈ ప్రచారంలో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇప్పటికే `మగధీర`లో రెండు జన్మలకు సంబంధించి రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు రామ్ చరణ్. అలాగే `నాయక్` చిత్రంలోనూ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు.