చిరంజీవి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన చరణ్!
on Jul 6, 2021
'శంకర్‌దాదా జిందాబాద్' (2007) మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు దూరమై, ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లారు. యస్.యస్. రాజమౌళి కోరిక మేరకు 'మగధీర' (2009) సినిమాలో రిమిక్స్ చేసిన "బంగారు కోడిపెట్ట" పాట సీక్వెన్స్‌లో కొడుకు రామ్‌చరణ్ పక్కన మెరుపులా మెరిశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు జె.కె. భారవి రూపొందించిన 'జగద్గురు ఆదిశంకర' (2013)లో మంజునాథస్వామిగా అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. ఆపైన కలిగిన అనుభవాలతో తనకు రాజకీయాలు అచ్చిరావని తెలుసుకున్న చిరంజీవి, తిరిగి పూర్తిస్థాయి నటునిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు.
విజయ్ నటించిన తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ 'కత్తి' రిమేక్ 'ఖైదీ నంబర్ 150' (2017)తో బ్లాక్‌బస్టర్ రిఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. దానికంటే ముందు ఆయన మరో సినిమాలో స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. అది తనయుడు చరణ్ సినిమా 'బ్రూస్లీ'. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో మొదట నటించాలని చిరంజీవి అనుకోలేదు. ఒకరోజు ఆయన ఇంటికి శ్రీను వైట్ల వచ్చి, గెస్ట్ అప్పీరెన్స్ గురించి అడిగారు. క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్ ఒక మెరుపులా వచ్చి, విలన్ బ్యాచ్ భరతం పడుతుందని, ప్రేక్షకులకు అది పండగలా ఉంటుందని ఆయన చెప్పడంతో చిరంజీవి కన్విన్స్ అయ్యారు.
"నాన్న మళ్లీ మేకప్ వేసుకొని నటిస్తుంటే అమ్మ కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఆయన లుక్‌ను నేనే సెట్ చేశాను. కాస్ట్యూమ్స్‌ను నేనే డిజైన్ చేశాను. క్లీన్ షేవ్‌తో చేద్దామని ఆయననుకున్నారు. నాకు 'గ్యాంగ్ లీడర్' గుర్తుకొచ్చి, ఒకరోజు మాసినగడ్డంతో కనిపిస్తే బాగుంటుందని చెప్పాను. ఆ గెటప్‌తోనే సెట్స్‌పైకి వచ్చారు." అని రామ్‌చరణ్ చెప్పాడు. నిజానికి చిరుపై ఓ పాట కూడా తీద్దామని శ్రీను వైట్ల చెబితే, వద్దని చరణ్ చెప్పాడు. ఆయన 150వ సినిమాకే పాటలు వదిలేద్దామని గట్టిగా చెప్పడంతో శ్రీను మరి మాట్లాడలేకపోయాడు.
చరణ్ 'మగధీర'లో ఏ గుర్రం మీద స్వారీ చేశాడో, 'బ్రూస్లీ'లోనూ అదే గుర్రంపై స్వారీ చేశాడు. "తనకు వైట్ హార్స్ కావాలని నాన్న అడిగారు. మా దగ్గర వైట్ హార్స్ లేదు. బయట్నుంచి తెప్పించాం. అది వైల్డ్‌గా ఉంది. అదింకా సంవత్సరం కూడా ట్రైనింగ్ కాలేదు. దానిపై నాన్న రైడింగ్ అంటే నాకు భయమేసింది. ఆ ఫైట్‌లో ఇద్దరం గుర్రాలపై కలిసివచ్చేలా ఓ షాట్ ఉంది. నాన్న ఫాస్ట్‌గా వెళ్లిపోయారు. నేను నమ్మలేకపోయా. ఆయనకు దానిపై ఎలా గ్రిప్ వచ్చిందో తెలీలేదు." అంటూ చెప్పుకొచ్చాడు చరణ్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
