మొన్న `శౌర్యం`.. నిన్న `వేదాళమ్`.. నేడు `అణ్ణాత్త`.. !
on Oct 28, 2021
తెలుగు చిత్రం `శౌర్యం`తో దర్శకుడైన శివ.. తమిళ సినిమాలతోనే కెప్టెన్ గా స్టార్ డమ్ చూశారు. మరీముఖ్యంగా.. `సిరుత్తై`, `వీరమ్`, `వేదాళమ్`, `విశ్వాసమ్` చిత్రాలతో అక్కడ మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారాయన. త్వరలో ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో `అణ్ణాత్త`తో పలకరించబోతున్నారు. తెలుగులో `పెద్దన్న` పేరుతో అనువాదం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. దీపావళి కానుకగా నవంబర్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో శివ తీసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. తెలుగులో `శౌర్యం`, తమిళంలో `వేదాళమ్`.. ఈ తరహా చిత్రాలే. ఈ రెండు కూడా కోల్ కతా నేపథ్యంలో సాగే చిత్రాలే కావడం మరో విశేషం. కట్ చేస్తే.. `అణ్ణాత్త` కూడా అచ్చంగా అలానే కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ కావడం గమనార్హం. మరి.. శివ సెంటిమెంట్ ఫలించి `శౌర్యం`, `వేదాళమ్` లాగే `అణ్ణాత్త` కూడా సక్సెస్ ఫుల్ వెంచర్ గా నిలుస్తుందేమో చూడాలి.
కాగా, `అణ్ణాత్త`లో రజినీకాంత్ కి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించగా.. నయన తార, మీనా, ఖుష్బూ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
Also Read