నాకు నేనే పోటీ అంటూ అజిత్, రజినీ ఫ్యాన్స్‌ని హర్ట్ చేసిన విజయ్!
on Dec 28, 2022

తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్, యూనివర్సల్ స్టార్ కమలహాసన్ తర్వాత అక్కడ ఇండస్ట్రీకి రెండు కళ్లుగా మారిన హీరోలు అజిత్- విజయ్. మన టాలీవుడ్ లో ఎన్టీఆర్- ఏఎన్నార్, కృష్ణ- శోభన్ బాబు, చిరంజీవి-బాలకృష్ణ, పవన్ కళ్యాణ్- మహేష్ బాబు ఎలా అయితే ఉన్నారో జనరేషన్ మారేకొద్దీ వీరు పోటీ పడుతున్నారు. తమిళనాడులో అజిత్- విజయ్‌లు కూడా అలాగే. వాస్తవానికి వారిద్దరికి అక్కడ సరి సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నిజానికి అజిత్ గొల్లపూడి మారుతీరావు కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ప్రేమ పుస్తకం తో హీరోగా మారారు.
ఆ చిత్రం షూటింగ్‌లోనే గొల్లపూడి శ్రీనివాస్ వైజాగ్ లో షూటింగ్ చేస్తూ సముద్రంలో కొట్టుకొని పోయి మరణించారు. ఇక విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో అజిత్ కంటే విజయ్ కి వరుస హిట్స్ వస్తున్నాయి. విజయ్ సరైన కాంబినేషన్స్ తో సినిమాలు తీస్తూ రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్లను బాగా పెంచుకుంటున్నారు. తెలుగులో కూడా ఆయనకు మంచి మార్కెట్ ఈ మధ్య ఏర్పడింది. ఈ విషయంలో అజిత్ బాగా వెనుకబడ్డారు. తెలుగు సినిమాతో హీరోగా పరిచయమైనప్పటికీ ఆయన ఆ తర్వాత తెలుగు మార్కెట్‌పై దృష్టి పెట్టలేదు.
తమిళనాడులో విజయ్-అజిత్‌లకు సరి సమానమైన మార్కెట్ ఉన్నప్పటికీ మిగిలిన ప్రాంతాలలో విజయ్ మార్కెట్ అజిత్ కంటే మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు వీరిద్దరూ హీరోలుగా నటిస్తున్న చిత్రాలు పొంగల్ రేస్‌లో పోటా పోటీగా విడుదల కానున్నాయి. అజిత్ నటించిన తునీవు, విజయ్ నటించిన వారిసు చిత్రాలు జనవరి 12న విడుదల కాబోతున్నాయి. అజిత్ నటించిన తునీవు చిత్రం తెలుగులో తెగింపు అనే పేరుతో విడుదల కానుంది. వారీసు చిత్రాన్ని వారసుడు పేరుతో మన దిల్ రాజు విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఆయనే నిర్మించడం విశేషం. ఇక విజయ్ ఇటీవల మాట్లాడిన కొన్ని మాటలు వివాదాస్పదంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నాకు ఒకరు పోటీగా ఉండేవారు. రోజులు గడుస్తుండే కొద్దీ అతను నాకు మరింత సీరియస్ పోటీని ఇచ్చారు. చివరికి అతన్ని నేను జయించాను. నాకు పోటీ ఇచ్చింది మరెవరో కాదు అది నాకు నేనే అంటూ విజయ్ చేసిన కామెంట్స్ కి అజిత్ ఫ్యాన్స్, సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వాస్తవానికి అజిత్ మితభాషి. చాలా సున్నిత మనస్కుడు. వివాదరహితుడు. ఆయనది కూడా రజనీ తరహా మనస్తత్వమే. కానీ ఎందుకనో ఆయన తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టడం లేదు. దాంతో తాజా చిత్రం తెగింపును కూడా తెలుగులో ఎవ్వరు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏమాత్రం బజ్ లేకుండా ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. తెలుగు విషయం పక్కన పెడితే విజయ్ చేసిన వ్యాఖ్యల వల్ల విజయ్, అజిత్ అభిమానుల మధ్య యుద్దం ఎక్కడి వరకు వెళ్తుందో వేచిచూడాల్సివుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



