'దోస్తీ' మ్యూజిక్ వీడియోలో 'సిరివెన్నెల' కనిపించాలి.. కానీ?
on Dec 1, 2021
లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి పాలై.. నవంబర్ 30న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన లేని తెలుగు సినిమా పాటను ఊహించుకోవడం కష్టంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ మధ్య ఉన్న వ్యక్తి ఇప్పుడు లేరంటే బాధగా ఉందంటూ సినీ ప్రముఖులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన అనారోగ్యం పాలైంది ఇటీవల కాదని, కొన్ని నెలల ముందు నుంచే ఆయన ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు అంటూ దర్శకుడు రాజమౌళి సంచలన విషయాన్ని బయటపెట్టారు.
సిరివెన్నెల మరణవార్త తెలిసి రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించి సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "1996 లో అర్థాంగి సినిమాతో తాము సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయిందని.. ఆ సమయంలో 'ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వాదులు కోవద్దురా ఓరిమి' అంటూ సిరివెన్నెల రాసిన పదాలు తమలో ధైర్యం నింపాయని" రాజమౌళి అన్నారు.
'సింహాద్రి'లో 'అమ్మయినా నాన్నయినా', 'మర్యాద రామన్న'లో 'పరుగులు తియ్' పాటలు సిరివెన్నెల రాసారని గుర్తుచేసుకున్న రాజమౌళి.. 'ఆర్ఆర్ఆర్'లో సిరివెన్నెల రాసిన దోస్తీ పాట గురించి చెబుతూ సంచలన విషయాన్ని పంచుకున్నారు. "ఆర్ఆర్ఆర్'లో దోస్తీ మ్యూజిక్ వీడియోకి లిరిక్ పేపర్ లో ఆయన సంతకం చేసే షాట్ తీద్దామని చాలా ప్రయత్నించాము. కానీ అప్పటికే ఆయన ఆరోగ్యం సహకరించక కుదర్లేదు" అని రాజమౌళి అన్నారు.
ఆగష్టు 1 న విడుదలైన దోస్తీ మ్యూజిక్ వీడియో షూట్ కొన్నిరోజుల ముందు అనగా జులైలో జరిగింది. రాజమౌళి చెప్పిన దాని బట్టి చూస్తే.. ఆ షూట్ లో పాల్గొనాల్సిన సిరివెన్నెల ఆరోగ్యం సహకరించక పాల్గొనలేదు. అంటే మూడు నెలల ముందే సిరివెన్నెల అనారోగ్యం పాలయ్యారని అర్థమవుతోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
