సందీప్ రెడ్డిని రాజమౌళి అంతమాట అనేశాడేంటి?
on Nov 28, 2023
మహానుభావుల మాటలు అర్థంకావు అన్నట్టుగా తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మాట్లాడిన మాటలు పొగిడాడో తిట్టాడో అర్థంకానట్టుగా ఉన్నాయి.
సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరగగా మహేష్ బాబు, రాజమౌళి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ సందీప్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పోల్చాడు.
"కొత్త కొత్త డైరెక్టర్లు వస్తారు. సూపర్ హిట్ సినిమాలు తీసి బాగా పేరు సంపాదిస్తారు. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే సినిమా అంటే ఇలాగే తీయాలి అనే ఫార్ములాను షేక్ చేసే దర్శకులు వస్తారు. మన తరంలో నాకు తెలిసి అలాంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. దాని తర్వాత సందీప్ రెడ్డినే. నార్మ్స్ ని, ఫార్ములాలను పక్కన పెట్టి నేను ఇలాగే సినిమా తీస్తా అని చాటిన దర్శకుడు సందీప్." అంటూ సందీప్ పై ప్రశంసలు కురిపించే ప్రయత్నం చేశాడు దర్శకధీరుడు.
అయితే సందీప్ గురించి రాజమౌళి మాట్లాడిన మాటలు నిజంగా ప్రశంసేనా అనే అనుమానం కలిగిస్తున్నాయి. బహుశా సందీప్ కూడా అదే సందిగ్ధంలో ఉండుంటాడు. ఒకప్పుడు ఆర్జీవీ గొప్ప దర్శకుడే కానీ కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాలు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. 'శివ'తో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన వర్మ.. ఆ తర్వాత తెలుగు, హిందీలో పలు హిట్ సినిమాలను తీశాడు. అయితే తర్వాత 'నేను ఇలాగే సినిమా తీస్తా' అనేది ముదిరి 'నా ఇష్టం'గా మారి ఏవేవో సినిమాలు తీస్తూ తన విలువని పోగొట్టుకున్నాడు. ఒకప్పటి ఆర్జీవీతో పోలిస్తే దానిని ప్రశంసగానే భావించాలి కానీ, ఇప్పటి ఆర్జీవీతో పోలిస్తే మాత్రం దానిని ప్రశంసగా భావించలేము.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
