నేను బొంగు కూడా కాంప్రమైజ్ కాను!
on Mar 5, 2020

పబ్‌లో తనపై జరిగిన దాడి విషయంలో తనకు పోలీసులు, ప్రభుత్వం న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని బిగ్ బాస్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక పబ్‌లో రాహుల్‌పై కొంతమంది భౌతిక దాడి చేయడం, బీరు సీసాతో తలపై కొట్టడం, అతను హాస్పిటల్ పాలవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గురువారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన రాహుల్ మీడియా ముందుకు వచ్చాడు. అతని ముక్కుపై, చెంపపై గాయాలు కనిపించాయి. అవతలి గ్యాంగ్ పదిమంది వరకు ఉన్నారనీ, వారిలో ముగ్గురు బాత్‌రూమ్ నుంచి వస్తూ తనతో వచ్చిన స్నేహితురాళ్లను కామెంట్ చేశారనీ, ఒకతను తనను తోయడంతో, అతని చేయి పట్టుకొని ఆపానని, దాంతో వాళ్లు గొడవ సృష్టించారనీ రాహుల్ తెలిపాడు. తనపై దాడి చేసిన వ్యక్తి పేరు రితేష్‌రెడ్డి అనీ, అతను టి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన వ్యక్తి అనీ రాహుల్ చెప్పాడు.
తనపై దాడి జరిగినంత మాత్రాన పబ్‌లకు పోకుండా ఆగనని, మనకు ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉన్నాయనీ, వాళ్లకు తాను భయపడననీ అతనన్నాడు. వాళ్లు గుడికి వచ్చి ఏమైనా చేస్తే గుడికి పోకుండా ఉంటానా? అని ప్రశ్నించాడు. పబ్ టైమ్ ముగిసే సమయంలో ఈ దాడి ఘటన జరిగిందనీ, సాధారణంగా క్లోజింగ్ టైమ్‌లో ప్రతి పబ్‌కూ పోలీసులు వస్తుంటారనీ, అలాగే ఆ సమయంలో అక్కడకు ఒక పోలీసు వచ్చారనీ రాహుల్ చెప్పాడు. తమకు రాజకీయ నేపథ్యం ఉందనీ, తమను ఎవడేం పీకుతాడని భావించే కొంతమంది పబ్‌లకు వెళ్లి రుబాబు చేస్తుంటారనీ, రితేష్‌రెడ్డిపై ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయనే విషయం తనకు తెలిసిందనీ అతను తెలిపాడు. ఏదేమైనా ఈ దాడి ఘటనకు సంబంధించి తనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నానని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తనపై దాడి చేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాననీ, వాళ్ల విషయంలో తాను బొంగు కూడా కాంప్రమైజ్ కానని అతను తేల్చి చెప్పాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



