ENGLISH | TELUGU  

'స్టార్ హీరోయిన్' స్టేట‌స్‌కు అడుగు దూరంలో నిలిచిపోయారు!

on May 30, 2020

 

సినీ రంగంలో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోవాల‌ని ఫ‌స్ట్ ఫిల్మ్ నుంచే ప్ర‌తి హీరోయినూ త‌పించిపోతుంటుంది. ఆ త‌ప‌న స‌హ‌జ‌మైన‌దే. టాలీవుడ్‌లో కొంత‌మంది న‌ట‌నా సామ‌ర్థ్య‌మున్నా, లేక‌పోయినా త‌మ అంద‌చందాల‌తో స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. మ‌రికొంత‌మంది ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత గ్లామ‌ర‌స్‌గా ఉన్నా ఏ రేంజి వ‌ర‌కూ ఎదిగి అక్క‌డ ఆగిపోతుంటారు. ఈ రెండో కోవ‌కు చెందిన‌వాళ్ల‌కు ఆఫ‌ర్స్ టాప్ హీరోయిన్ల మాదిరిగానే ఎప్ప‌డూ ఉంటూనే ఉంటాయి. కాక‌పోతే ఆ అవ‌కాశాలు టాప్ హీరోల స‌ర‌స‌న కాకుండా.. సెకండ్ టైర్‌, థ‌ర్డ్ టైర్ హీరోల స‌ర‌స‌నే ల‌భిస్తుంటాయి. టాప్ హీరోలు ఎందుక‌నో ఈ హీరోయిన్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌రు. మొద‌టి కోవ‌లోకి త్రిష‌, శ్రియ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, ఇలియానా, త‌మ‌న్నా, శ్రుతి హాస‌న్‌, స‌మంత‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, పూజా హెగ్డే, ర‌ష్మికా మంద‌న్న‌ వంటి వాళ్లు వ‌స్తారు. రెండో కోవ‌లోకి రాశీ ఖ‌న్నా, లావ‌ణ్యా త్రిపాఠి వంటివాళ్లు వ‌స్తారు.

వీరిలో లావ‌ణ్యా త్రిపాఠి, రాశీ ఖ‌న్నాల‌కు సినీ రంగంలోకి అడుగు పెట్టిన‌ప్ప‌ట్నుంచీ చేతిలో ఎప్ప‌డూ సినిమాలు ఉంటూనే ఉన్నాయి. అయినా వీళ్ల‌ను సినీ మాయా ప్ర‌పంచంలో స్టార్ హీరోయిన్స్‌గా గుర్తించ‌రు. ఫ‌ర్ ఎగ్జాంపుల్‌.. రాశీ ఖ‌న్నా కెరీర్‌నే తీసుకుందాం.. జిల్‌, సుప్రీమ్‌, జై ల‌వ‌కుశ‌, తొలిప్రేమ‌, ప్ర‌తిరోజూ పండ‌గే వంటి హిట్ సినిమాలు ఆమె లిస్ట్‌లో ఉన్నాయి. 'సుప్రీమ్‌'లో బెల్లం శ్రీ‌దేవి, 'తొలిప్రేమ‌'లో వ‌ర్ష క్యారెక్ట‌ర్లు ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. కానీ స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ రాలేదు. జూనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ 'జై ల‌వ కుశ‌'లో ఇద్ద‌రు హీరోయిన్ల‌లో ఒక‌రిగా న‌టించ‌డం మిన‌హా మిగ‌తా ఏ టాప్ హీరో కూడా ఆమెను త‌మ స‌ర‌స‌న ఎంక‌రేజ్ చేయ‌ట్లేదు. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేసిన 'వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌'లో ఆమె చేసిన యామిని క్యారెక్ట‌ర్ ఆమెకు మంచి పేరు అటుంచి, చెడ్డ‌పేరును తెచ్చింది. టాలీవుడ్‌లో ఇలాంటి ప‌రిస్థితి ఉండ‌టంతో ప్ర‌స్తుతం ఆమె కోలీవుడ్‌పై దృష్టిపెట్టి అక్క‌డ ఎక్కువ సినిమాలు చేస్తోంది. అంద‌చందాల ప‌రంగా రాశీని అంద‌రూ పొగుడుతుంటారు. ఆమె ప‌ర్ఫార్మెన్స్‌నూ మెచ్చుకుంటూ ఉంటారు. ఐనా కెరీర్ ప‌రంగా ఆమె హోదా మాత్రం పెర‌గ‌డం లేదు. త‌ప్ప‌కుండా త‌న‌కు మంచిరోజు ఏనాటికైనా వ‌చ్చి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటాన‌ని ఆశ‌గా ఎదురుచూస్తోంది రాశీ.

ఇక లావ‌ణ్యా త్రిపాఠి విష‌యానికి వ‌ద్దాం. ఫ‌స్ట్ మూవీ 'అందాల రాక్ష‌సి'తోటే ఆడియెన్స్‌తో పాటు ఇండ‌స్ట్రీని కూడా ఆక‌ర్షించింది లావ‌ణ్య‌. కానీ ఆమె కెరీర్ ఒక అడుగు ముందుకు, ఇంకో అడుగు వెన‌క్కు అన్న చందంగా న‌డుస్తోంది. దూసుకెళ్తా, భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా, శ్రీ‌ర‌స్తు శుభ‌మ‌స్తు వంటి హిట్ మూవీస్‌లో త‌న న‌ట‌న‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్న‌ప్ప‌టికీ, టాప్ స్టార్స్ స‌ర‌స‌న ఛాన్సులు రావ‌ట్లేదు. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఆమెకు అడుగు దూరంలోనే ఉంటోంది. ఆమె ఒక దాని త‌ర్వాత ఒక‌టిగా సినిమాలు చేస్తూనే ఉంది. కానీ టాప్ స్టార్ల సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించాల‌న్న ఆమె కోరిక ఇప్ప‌ట్లో తీరేలా క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆమె నిఖిల్‌, సందీప్ కిష‌న్ వంటి స్టార్‌డ‌మ్‌కు దూరంగా ఉన్న హీరోల స‌ర‌స‌న చేస్తూ మ‌ధ్య త‌ర‌హా సినిమాల హీరోయిన్ పేరును మాత్రం సంపాదించుకుంది.

ఆశ్చ‌ర్య‌మేమంటే వీళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కీర్తి సురేశ్‌, ర‌ష్మికా మంద‌న్న వంటి తార‌లు టాప్ స్టార్ల స‌ర‌స‌న అవ‌కాశాలు పొందుతూ త‌మ డిమాండ్‌ను పెంచుకుంటున్నారు. అటు గ్లామ‌ర్‌, ఇటు టాలెంట్ రెండూ ఉన్న‌ప్ప‌టికీ రాశీ ఖ‌న్నా, లావ‌ణ్యా త్రిపాఠీల‌కు స్టార్ హీరోయిన్ ఇమేజ్ అంద‌ని ద్రాక్ష‌పండుగానే ఉంటోంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.