లక్ష్మీ రాయ్ తొలి సంపాదన ఎంతంటే..!
on Aug 1, 2021
లక్ష్మీ రాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ పుట్టింది బెంగళూరులో. ఆమెకు రెండు ముద్దు పేర్లున్నాయి. అమ్మ లూసీ అని పిలిస్తే, నాన్న, ఇద్దరు అక్కలూ కృష్ణా అని పిలుస్తారు. చిన్నప్పట్నుంచీ లక్ష్మికి నటన మీద ఇంట్రెస్ట్ ఉంది. మాధురీ దీక్షిత్ అన్నా, ఆమె నటన అన్నా తనకు బాగా ఇష్టం. మాధురిని అనుకరిస్తుండేది కూడా. సినిమాల్లోకి రాకముందు లక్ష్మి మోడలింగ్ చేసింది. 2002 తర్వాత 'మిస్ బెల్గామ్' పోటీల్లో సెలక్ట్ అయ్యింది. తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి.
2005లోనే తమిళ, తెలుగు, కన్నడ.. మూడు భాషల సినిమాల్లో తెరంగేట్రం చేసింది లక్ష్మి. టాలీవుడ్లో శ్రీకాంత్ సరసన నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' తొలి చిత్రం. కన్నడ సినిమా 'వాల్మీకి' నుంచి అందుకున్న రూ. 25 వేలు ఆమె అందుకున్న తొలి సినిమా పారితోషికం. అందులో శివ రాజ్‌కుమార్ హీరో. ఆమెకు ఇష్టమైన నటులు.. మోహన్‌లాల్, షారుఖ్ ఖాన్, బాలకృష్ణ. హీరోయిన్లలో మాత్రం మాధురీ దీక్షిత్.
షూటింగ్స్ లేనప్పుడు ఇంట్లో ఫ్యామిలీతో గడపడమంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. ఆమెకు దైవభక్తి ఎక్కువే. అందరు దేవుళ్లనూ పూజిస్తుంది. మనుషుల్లో కూడా దేవుడుంటాడనేది ఆమె నమ్మకం. ఎదుటి వ్యక్తుల్లో ఆమెకు నచ్చని విషయం.. నమ్మక ద్రోహం. ఈ భయంతోనే కొత్తవారిని అంత తొందరగా నమ్మదు లక్ష్మి. ఇతరులకు సాయపడే గుణం ఉన్నవారంటే ఆమెకు చాలా ఇష్టం.
తిండి విషయంలో లక్ష్మికి ఎలాంటి నియమాలూ లేవు. కాకపోతే, పోషక విలువలున్న ఆహారం తీసుకుంటుంది. సినిమాల్లోకి వచ్చి పదహారేళ్లయినా చెక్కుచెదరని అందంతో, ఫిట్నెస్తో ఆమె కనిపించడం వెనుక రహస్యం.. యోగా! మేకప్ కూడా వీలైనంత తక్కువగా వేసుకుంటుంది. జీరో సైజ్ మీద ఆమెకు నమ్మకం లేదు. అందరూ జీరో సైజ్‌కు కృషి చేస్తున్నారని ఆ దారిలో వెళ్లాలని ఆమె అనుకోదు. తను తనలా ఉండటానికే ఇష్టపడుతుంది.
ఈ రోజుల్లో యూత్‌ను ఆకర్షించాలంటే గ్లామర్ అవసరమని నమ్ముతుంది లక్ష్మి. గ్లామరస్‌గా ఉండటం వేరు, అశ్లీలంగా కనిపించడం వేరు.. అనేది ఆమె అభిప్రాయం. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రలో రాయ్ లక్ష్మి కాకుండా ఆ పాత్రే కనిపించాలనేది ఆమె లక్ష్యం.
Also Read