హృతిక్ రోషన్ హీరోయిన్ను టాలీవుడ్‌కు తెచ్చిన హను!
on Aug 1, 2021
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంని అనుసరించే, అనుకరించే దర్శకుల్లో టాలీవుడ్ కెప్టెన్ హను రాఘవపూడి ఒకరు. మొదటి సినిమా `అందాల రాక్షసి` నుంచి గత చిత్రం `పడి పడి లేచే మనసు` వరకు హను పనితీరుని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. విజువల్స్ పరంగా మణి శైలిని ఫాలో అవడమే కాకుండా.. తన సినిమాల్లో కథానాయికలని కూడా రత్నం తరహాలోనే ఆవిష్కరిస్తుంటాడు హను రాఘవపూడి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఇప్పటివరకు హను నాలుగు చిత్రాలను రూపొందించగా.. వాటిలో మూడు సినిమాల్లో డెబ్యూ హీరోయిన్సే నటించారు. `అందాల రాక్షసి`తో లావణ్య త్రిపాఠి, `కృష్ణగాడి వీరప్రేమగాథ`తో మెహ్రీన్, `లై`తో మేఘా ఆకాశ్.. తెలుగునాట తొలి అడుగులు వేశారు. హను ప్రీవియస్ మూవీ `పడి పడి లేచే మనసు`లో మాత్రం స్టార్ హీరోయిన్ సాయిపల్లవి సందడి చేసింది.
కట్ చేస్తే.. తన ఆన్ గోయింగ్ వెంచర్ లో మరోసారి తెలుగువారికి పరిచయం లేని నాయికని ఎంచుకున్నాడు హను. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. `సూపర్ 30` చిత్రంలో హృతిక్ రోషన్‌కి, 'తూఫాన్'లో ఫరాన్ అఖ్తర్కి జంటగా నటించిన మృణాళ్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తొలుత పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి అగ్ర కథానాయికల పేర్లు వినిపించినా.. చివరాఖరికి ఆ అవకాశం మృణాళ్ కి దక్కింది.
ఆగస్టు 1.. మృణాళ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకి విషెస్ చెపుతూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో లెఫ్టినెంట్ రామ్ (దుల్కర్) జోడీ సీత పాత్రలో మృణాల్ కనిపించనున్నది. 'తూఫాన్'లో ఆమె నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. మరి.. హను పరిచయం చేసిన నాయికలు లావణ్య, మెహ్రీన్, మేఘ తరహాలో మృణాళ్ కూడా తెలుగులో మరిన్ని సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుందేమో చూడాలి.
Also Read