ENGLISH | TELUGU  

త‌ప్పు మాట్లాడ్డం కంటే నాలుక కొరికేసుకోవ‌డం మంచిది!

on Jun 27, 2022

 

బండ్ల గ‌ణేశ్ 'చోర్ బ‌జార్' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో పూరి జ‌గ‌న్నాథ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అయిన విష‌యం మ‌న‌కు తెలుసు. కొడుకు ఆకాశ్ సినిమా రిలీజ‌వుతుంటే, ఆ విష‌యం ప‌ట్టించుకోకుండా ఎక్క‌డున్నాడో అంటూ పూరిని ఏకేశాడు గ‌ణేశ్‌. అయితే అత‌డి వ్యాఖ్య‌లు జ‌గ‌న్‌కు మ‌స్త్ కోపం తెప్పించాయ‌ని తెలుస్తోంది. అందుకే నాలుక జారొద్ద‌ని త‌న లేటెస్ట్ 'మ్యూజింగ్స్‌' పాడ్‌కాస్ట్‌లో సూచించాడు. బండ్ల గ‌ణేశ్ పేరు నేరుగా ప్ర‌స్తావించ‌కుండా, "త‌ప్పు మాట్లాడ్డం కంటే నాలుక కొరికేసుకోవ‌డం చాలా మంచిది" అని వార్నింగ్ కూడా ఇచ్చేశాడు. 

త‌న లేటెస్ట్ పాడ్‌క్యాస్ట్‌ను 'టంగ్' అనే టైటిల్‌తో రిలీజ్ చేశాడు పూరి జ‌గ‌న్నాథ్‌. "గుర్తుపెట్టుకోండి.. మ‌న నాలుక క‌దులుతున్నంత సేపూ మ‌నం ఏమీ నేర్చుకోలేం. అందుకే లైఫ్‌లో ఎక్కువ టైమ్ లిజ‌న‌ర్స్‌గా ఉంటే చాలా మంచిది. నీ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కావ‌చ్చు, క్లోజ్ ఫ్రెండ్స్ కావ‌చ్చు, ఆఫీస్ పీపుల్ కావ‌చ్చు.. ఆఖ‌రికి క‌ట్టుకున్న పెళ్లాం ముందు కూడా ఆచితూచి మాట్లాడండి. చీప్‌గా వాగొద్దు, చీప్‌గా బిహేవ్ చేయొద్దు. మ‌న వాగుడు మ‌న కెరీర్‌నీ, మ‌న క్రెడిబిలిటీనీ డిసైడ్ చేస్త‌ది. మీకు సుమ‌తీ శ‌త‌కం గుర్తుండే ఉంటుంది.. 'నొప్పింప‌క తానొవ్వ‌క త‌ప్పించుకు తిరుగువాడే ధ‌న్యుడు సుమ‌తీ' అని. త‌ప్పు మాట్లాడ్డం కంటే నాలుక కొరికేసుకోవ‌డం చాలా మంచిది. ఫైన‌ల్‌గా ఓ మాట‌. నీ లైఫ్‌, నీ డెత్‌.. నీ టంగ్ మీద ఆధార‌ప‌డి ఉంటాయ్‌." అని చెప్పుకొచ్చాడు.

'చోర్ బజార్' ప్రీరిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ఈ ఈవెంట్ కి తాను తన వదిన లావణ్య గారికోసమే వచ్చానని తెలిపాడు. తన తల్లిని ఎంత గౌరవిస్తానో, ఆమెని అంత గౌరవిస్తానని చెప్పాడు. పూరి అన్న సక్సెస్ జర్నీలో మెజారిటీ షేర్ లావణ్య గారికే దక్కుతుందని అన్నాడు. "ఎన్నో ర్యాంప్ లు, వ్యాంప్ లు వస్తుంటాయి, పోతుంటాయి. అమ్మ కలకాలం ఉంటుంది. పూరి దగ్గర ఏమీలేని రోజుల్లోనే ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూరి స్టార్ అయ్యాక చాలామంది వచ్చారు." అంటూ బండ్ల కామెంట్స్ చేశాడు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కి పూరి రాకపోవడంపై బండ్ల గణేష్ అసహనం వ్యక్తం చేశాడు. "ఎందరినో సూపర్ స్టార్లని చేసిన ఆయనకు కన్న కొడుకు ఈవెంట్ కి వచ్చే టైం లేదు. అదే నా కొడుకు ఈవెంట్ అయితే నేను లండన్ లో ఉన్నా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వస్తాను. నేను బ్రతికేదే నా కుటుంబం కోసం. పూరి అన్న ఎక్కడున్నాడో, ఏం బిజీగా ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు అన్నా. ఎందుకంటే మనం ఏం చేసినా, ఎంత సంపాదించినా పిల్లల కోసమే. మనం పోతే తలకొరివి పెట్టేది వాళ్లే. మన కన్నాం కాబట్టి మనదే బాధ్యత. బాధ్యత తీసుకున్నాం కాబట్టి చచ్చేదాకా వదలకూడదు. ఎందరినో స్టార్ హీరోలను చేశావ్, నన్ను స్టార్ ప్రొడ్యూసర్ ని చేశావ్.. నీ కొడుకు టైం వచ్చేసరికి ముంబైలో కూర్చుంటే ఎలా అన్న?" అంటూ పూరికి చురకలు వేశాడు బండ్ల.

"ఆకాష్ అద్భుతమైన నటుడు. టాలెంట్ ఉంది. నువ్వు చేసినా, చేయకపోయినా నీ కొడుకు స్టార్ అవుతాడు. ఆకాష్ డేట్స్ కోసం నువ్వు కూడా క్యూలో నిల్చొనే రోజు వస్తుంది. ఆరోజు నీకు ఆకాష్ డేట్స్ ఇవ్వకుండా నేను చేస్తాను" అంటూ బండ్ల సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కామెంట్స్ టైమింగ్‌, పాడ్‌క్యాస్ట్‌కు టంగ్ అనే హెడింగ్ పెట్ట‌డం.. బండ్ల గ‌ణేశ్‌ను ఉద్దేశించేన‌ని స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. గ‌ణేశ్ చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా జ‌గ‌న్‌పై అంద‌రి దృష్టీ మ‌ళ్ల‌డ‌మే కాకుండా, ఆయ‌న‌ ఇమేజ్‌ను డామేజ్ చేశాయ‌ని కూడా చెప్పాలి. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.