`ప్రేమ్ ఖైదీ`కి 30 ఏళ్ళు!
on Jun 21, 2021

తెలుగునాట తిరుగులేని నిర్మాతగా వెలుగొందిన `మూవీ మొఘల్` డి. రామానాయుడు.. పలు ఇతర భాషల్లో సినిమాలు నిర్మించారు. మరీముఖ్యంగా.. హిందీనాట కూడా తనదైన బాణీ పలికించారు. అలా.. ఆయన నిర్మించిన విజయవంతమైన చిత్రాల్లో `ప్రేమ్ ఖైదీ` ఒకటి. తెలుగులో ఘనవిజయం సాధించిన `ప్రేమఖైదీ` చిత్రానికి హిందీ రూపమిది. ఇక్కడి వెర్షన్ లో కథానాయకుడిగా నటించిన హరీశ్.. హిందీ రీమేక్ లోనూ అదే పాత్రని అభినయించాడు. ఇక ఈ సినిమాతోనే బాలీవుడ్ అగ్ర కథానాయిక కరిష్మా కపూర్ హీరోయిన్ గా హిందీ చిత్ర పరిశ్రమలో తొలి అడుగేయడం విశేషం. ఈ సినిమా చేసే నాటికి ఆమె వయసు పదహారేళ్ళు. కపూర్ కుటుంబం నుండి వచ్చిన తొలి కథానాయిక కరిష్మానే కావడం అప్పట్లో వార్తల్లో నిలిచింది.
భరత్ భూషణ్, దిలీప్ తహిల్, పరేష్ రావెల్, రమా విజ్, హరీశ్ పటేల్, జేడీ చక్రవర్తి, అలీ, నర్సింగ్ యాదవ్, రజిత ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె. మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఆనంద్ - మిలింద్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని పాటలన్నింటికీ `గాన గంధర్వుడు` ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రమందించారు. ఆరు పాటల్లో ఐదు పాటలను బాలుతో కలిసి కవితా కృష్ణమూర్తి గానం చేయగా ఓ పాటని సాధనా సర్గమ్ ఆలపించారు. 1991 జూన్ 21న విడుదలైన `ప్రేమ్ ఖైదీ`.. నేటితో 30 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



