కరోనాపై తెలుగులో తొలి చిత్రం
on May 29, 2020

నేడు (మే 29) డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. తను మునుపటి రెండు చిత్రాలు 'అ!', 'కల్కి'లతో ప్రేక్షకులను ఆకట్టుకొని ప్రామిసింగ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు తన మూడో చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సినిమాని ఆయన తీస్తుండటం విశేషం. ఇది ఆ మహమ్మారిపై తయారవుతున్న తొలి చిత్రం.
ప్రశాంత్ వర్మ బర్త్‌డే సందర్భంగా ఆ మూవీ ప్రి-లుక్, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కొండారెడ్డి బురుజు ముందు, భయంకర రాకాసి జనాన్ని చంపుతున్నట్లుగా ఆ లుక్‌లో కనిపిస్తోంది. ఆ రాకాసి చేస్తున్న భయానక గర్జనతో అది మరింత ప్రమాదకరమైందిగా కనిపిస్తోంది. పోస్టర్‌పై "కరోనా వాజ్ జస్ట్ ద బిగినింగ్" అనే క్యాప్షన్ ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్ల ద్వారా 'ఇంట్లో ఉండండి, క్షేమంగా ఉండండి' అనే సందేశాన్ని అందిస్తున్నారు.
వెన్ను జలదరించే విజువల్స్, భయపెట్టే బీజీఎంతో ప్రి-లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఒకవైపు ఆసక్తినీ, ఇంకోవైపు ఉద్వేగాన్నీ కలిగిస్తున్నాయి. కథా పరంగా చూసినప్పుడు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన మునుపటి సినిమాలు 'అ!', 'కల్కి' ఒకదానికొకటి పూర్తి భిన్నమైనవి. ఇప్పుడు మరో పూర్తి భిన్నమైన, ఇప్పటిదాకా ఎవరూ స్పృశించని సబ్జెక్ట్‌తో ఆయన మూడో చిత్రాన్ని తీస్తున్నారు. ఈ సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టబోతున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకూ 40 శాతం చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రానికి పనిచేస్తోన్న తారాగణం, సాంకేతిక నిపుణులతో పాటు ఇతర వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.


Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



