"తెగేదాకా లాక్కండి".. ప్రకాశ్‌రాజ్ వార్నింగ్!
on Aug 5, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై గట్టి పట్టుదలతో ఉన్న విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్.. ఆ ఎన్నికలను వాయిదా వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలపై తీవ్ర అసహనంతో ఉన్నారని రీసెంట్‌గా చేసిన ట్వీట్ తెలియజేస్తోంది. ఫలానా విషయంపై అని డైరెక్టుగా చెప్పకుండా "తెగేదాకా లాక్కండి" అని ఆయన ట్వీట్ చేశారు. దానికి #Justasking అనే హ్యాష్‌ట్యాగ్ జోడించారు. 'మా' ఎన్నికల గురించే ఆయన అలా ట్వీట్ చేశారని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఆ ట్వీట్‌కు వచ్చిన కామెంట్స్ కూడా దీన్నే సూచిస్తున్నాయి.
నిజానికి సెప్టెంబర్‌లో మా ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ కొవిడ్ మహమ్మారి పరిస్థితులను చూపిస్తూ, ఎన్నికలు వాయిదా వేయడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ప్రకాశ్‌రాజ్ వర్గీయులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఇండస్ట్రీలో బాగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్ వ్యవహారశైలి దానికి ఊతమిస్తోందంటున్నారు.
అలాగే మా ప్రెసిడెంట్ చైర్‌పై కన్నేసిన మంచు విష్ణు ఎన్నికలు ఏకగ్రీవం కాకపోతే తాను బరిలో నిలబడేది ఖాయమంటూ తేల్చేశారు. పెద్దలంతా కూర్చొని ఒకరిని అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా నిర్ణయిస్తే, తాను ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్తున్నారు. అయితే అధ్యక్ష కుర్చీలో ప్రకాశ్‌రాజ్ కూర్చోవడం విష్ణు వర్గీయులకు ఇష్టం లేదనేది బహిరంగ రహస్యం. దీంతో ప్రకాశ్‌రాజ్ వర్గం, విష్ణు వర్గం అంటూ ఇండస్ట్రీలోని నటులు రెండుగా చీలిపోయారు. ప్రకాశ్‌రాజ్‌కు మెగా బ్యాచ్ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. విష్ణుకు బాలకృష్ణ, నరేశ్‌తో పాటు ఇండస్ట్రీలోని బిగ్ ఫ్యామిలీస్‌కు చెందిన నటుల సపోర్టు ఉందని ప్రచారం జరుగుతోంది.
'మా' ఎన్నికలను వాయిదా వేయడానికి నరేశ్ ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నందునే ప్రకాశ్‌రాజ్ "తెగేదాకా లాక్కండి" ట్వీట్ చేశారనీ, ఆ ట్వీట్‌తో హెచ్చరికను కూడా పంపారనీ అనుకుంటున్నారు. ఒకవేళ 'మా' ఎన్నికలు వాయిదాపడేట్లయితే ప్రకాశ్‌రాజ్ ఏం చేస్తారు, ఏం తెంచుతారనే చర్చ మొదలైంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
