తెలుగు భాష వచ్చు కానీ, నాగబాబు భాష రాదంటూ ప్రకాశ్‌రాజ్ సెటైర్!
on Nov 28, 2020
నటులు ప్రకాశ్‌రాజ్, నాగబాబు మధ్య మాటల యుద్ధం ముదిరేటట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూటకు ఓ మాట మారుస్తున్నారని.. ఆయన ఓ ఊసరవెల్లి అంటూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సహజంగానే పవన్ కల్యాణ్ చిన్నన్నయ్య నాగబాబుకు కోపం వచ్చింది. ఆయనకు కౌంటర్‌గా దేశానికి అభివృద్ధి బీజేపీ, జనసేనతోనే సాధ్యమవుతోందన్నారు నాగబాబు. ప్రకాశ్ రాజ్ లాంటి కుహనా మేధావులు ఎంతవాగినా బీజేపీ, జనసేన విజయాన్ని ఆపలేరని.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని నాగబాబు హెచ్చరించారు. అంతేకాదు, ఆయన వ్యక్తిగతంగా ఎలాంటివాడో తను ట్వీట్ చేసిన నోట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
"నిర్మాతలని ఎన్ని రకాలుగా డబ్బు కోసం హింస పెట్టావో, ఇచ్చిన డేట్స్‌ని కేన్సిల్ చేసి ఎంత హింసకి గురిచేశావో ఇంకా గుర్తున్నాయ్ ప్రకాశ్‌రాజ్. ముందు నువ్వు మంచిగా తయారయ్యి, అప్పుడు పవన్ కల్యాణ్ అనే ఒక మంచి మనిషి నిస్వార్థపరుడైన నాయకుడిని విమర్శించు. డైరెక్టర్స్‌ని కాకాపట్టి నిర్మాతలని కాల్చుకుతిన్న నీకు ఇంతకన్నా మంచిగా మాట్లాడ్డం ఏమి తెలుసు?" అంటూ చాలా పరుషంగా ప్రకాశ్‌రాజ్‌ను నాగబాబు విమర్శించారు.
నాగబాబు ఆరోపణలకు, విమర్శలకు ప్రకాశ్‌రాజ్ ఏం సమాధానం చెబుతారోనని మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రకాశ్‌రాజ్ ఫ్యాన్స్, సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూశారు. నాగబాబుకు ప్రకాశ్‌రాజ్ ఆన్సర్ ఇచ్చారు. చాలా కూల్‌గా, తనదైన శైలిలో ఇచ్చారు. "గౌరవనీయులైన నాగబాబుగారికి, మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు." అని వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు. దాంతో పాటు నాలుగు నమస్తే ఎమోటికాలను జోడించారు. ప్రకాశ్‌రాజ్ సెటైర్‌కి నాగబాబు సైలెంట్ అవుతారో, తనూ గట్టి కౌంటర్ సెటైర్స్ వేస్తారో చూడాలి.
Also Read