ENGLISH | TELUGU  

ప్ర‌కాశ్‌రాజ్ వ‌ద‌ల‌డం లేదుగా.. ఎన్నిక‌ల రోజు సీసీ ఫుటేజ్ కావాల‌ని డిమాండ్‌!

on Oct 14, 2021

 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న ప్ర‌కాశ్‌రాజ్ ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌ద‌లాల‌ని అనుకోవ‌ట్లేదు. మోహ‌న్‌బాబును, మంచు విష్ణును ఇర‌కాటంలో పెట్ట‌డానికి శ‌త‌విధాలా య‌త్నిస్తున్నారు. మొద‌ట రాజీనామా అస్త్రాన్ని ప్ర‌యోగించిన ఆయ‌న‌, ఇవాళ‌ ఎన్నిక‌ల రోజు సీసీ కెమెరాల ఫుటేజ్ త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరుతూ పోలింగ్ ఆఫీస‌ర్‌కు ఒక లేఖ రాశారు. దానిని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. 

ఎన్నిక‌ల రోజు మోహ‌న్‌బాబు, న‌రేశ్ అదుపుత‌ప్పి, అసాంఘికంగా ప్ర‌వ‌ర్తించార‌ని, 'మా' స‌భ్యుల‌ను దూషించి, భౌతిక దాడులు చేశార‌నీ ఆ లేఖ‌లో ఆరోపించారు. వారిని మీ విచ‌క్ష‌ణాధికారాన్ని ఉప‌యోగించి పోలింగ్ ప్ర‌దేశంలోకి అనుమ‌తించారా అని అడిగారు. ఆరోజు జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌న్నింటినీ అక్క‌డి సీసీ కెమెరాలు రికార్డ్ చేసుంటాయి కాబట్టి, స‌త్వ‌ర‌మే ఆ ఫుటేజ్‌ను త‌మ‌కు అంద‌జేయాల‌ని కోరారు. ఆ ఫుటేజ్ చూడ్డం త‌మ ప్ర‌జాస్వాహిక హ‌క్కుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. త‌న లేఖ‌కు వెంట‌నే స్పందించ‌క‌పోతే, సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ను తొల‌గించ‌డ‌మో, చెరిపేయ‌డ‌మో జ‌రుగుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ప్ర‌కాశ్‌రాజ్‌. 

అక్టోబ‌ర్ 10న జ‌రిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల‌కు పోలింగ్ ఆఫీస‌ర్‌గా కృష్ణ‌మోహ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న‌కు ప్ర‌కాశ్‌రాజ్ రాసిన లేఖ పూర్తి పాఠం...

"డియ‌ర్ కృష్ణ‌మోహ‌న్ గారూ,
ఇటీవ‌ల జ‌రిగిన 'మా' ఎల‌క్ష‌న్స్‌లో జ‌రిగిన ప‌లు దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లకు మీరు సాక్షులు. ఆవేశాలు పెరిగిపోయాయ్‌. డీఆర్‌సీ మెంబ‌ర్ శ్రీ మోహ‌న్‌బాబు, మాజీ అధ్య‌క్షుడు న‌రేశ్ అదుపుత‌ప్పిన‌, అసాంఘిక ప్ర‌వ‌ర్త‌న‌ను మ‌నం చూశాం. వారు 'మా' స‌భ్యుల్ని దూషించారు, బెదిరించారు, భౌతికంగా వారిపై దాడి చేశారు. మీ విచ‌క్ష‌ణాధికారాన్ని ఉప‌యోగించి పోలింగ్ ప్రాంతంలోకి వారినీ, వారి అనుచ‌రుల్నీ అనుమ‌తించార‌ని నేను భావిస్తున్నాను. కొన్ని విజువ‌ల్స్ మీడియాకు లీక్ అయ్యాయి. మా ఎన్నిక‌లు, త‌ర్వాతి ఘ‌ట‌న‌లు ప్ర‌జ‌ల దృష్టిలో న‌వ్వులాట‌గా మారాయి.

కొంత‌మంది తెలిసిన‌వాళ్ల ప్ర‌వ‌ర్త‌న అస‌హ్యం క‌లిగించింది. ఈ రిపోర్టుల్లో నిజం తెలుసుకోవాల‌ని 'మా' స‌భ్యులు కూడా కోరుకుంటున్నారు. మీ మాట‌ల్లో పోలింగ్ సంద‌ర్భంగా సీసీ కెమెరాల‌ను ఉప‌యోగించిన‌ట్లు చెప్పారు. క‌చ్చితంగా అన్నింటినీ ఆ కెమెరాలు రికార్డ్ చేశాయ‌నుకుంటాను. కాబ‌ట్టి, సీసీటీవీ ఫుటేజ్‌ను మాకివ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పోలింగ్‌కు సంబంధించిన స‌మాచారాన్ని పొందడం మా ప్ర‌జాస్వామిక హ‌క్కు. క‌నీసం మూడు నెల‌ల పాటు అన్ని రికార్డుల్నీ భ‌ద్ర‌ప‌ర్చాల్సిన బాధ్య‌త ఒక పోలింగ్ ఆఫీస‌ర్‌గా మీమీద ఉంది.

ఆ రికార్డుల్ని పోలింగ్ ఆఫీస‌ర్లు భ‌ద్ర‌ప‌ర్చ‌డం త‌ప్ప‌నిస‌రి అని ప‌లు సుప్రీంకోర్టు తీర్పులు కూడా స్ప‌ష్టం చేశాయి. కాబ‌ట్టి వీలైనంత త్వ‌ర‌గా సీసీ ఫుటేజ్‌ను మాకు అంద‌జేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. స‌త్వ‌ర‌మే మీరు స్పందించ‌క‌పోతే, ఆ ఫుటేజ్ డిలీట్ అవడ‌మో లేక చెరిపేయ‌బ‌డ‌ట‌మో జ‌రుగుతుంద‌ని భ‌య‌ప‌డుతున్నాను. థాంక్స్ అండ్ రిగార్డ్స్‌, ప్ర‌కాశ్‌రాజ్‌"

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.