పాచి పోయిన.. పవన్ స్పీచ్
on Sep 10, 2016

రెండు లడ్డూలిచ్చారు... పాచిపోయిన లడ్డూలిచ్చారు.. అంటూ ప్రత్యేక ప్యాకేజీ గురించి పవన్ కల్యాణ్ కాకినాడ సభలో సెటైర్ వేశాడు. ప్రత్యేక ప్యాకేజీనే కాదు.. పవన్ స్పీచ్ కూడా అలానే పాచి కంపు కొడుతోందని.. ఆయన్ని విమర్శించేవాళ్లు జోకులు వేసుకొంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. సుదీర్ఘంగా సాగిన పవన్ స్పీచ్‌లో ఎక్కడా కొత్త విషయాలు లేవు. తిరుపతి సభలో చెప్పిన మాటలే ఇటు తిప్పి... అటు తిప్పి దానికి కాస్త చరిత్ర జోడించి, ఇంకొన్ని పంచ్ డైలాగులు యాడ్ చేసి వదిలాడంతే. పవన్ మాటల్లో ఆవేశం కనిపించినా అది అంతంత మాత్రంగానే మిగిలింది. మొత్తానికి పవన్ స్పీచ్ ఎప్పుడూ లేనంతగా బోర్ కొట్టించింది. చంద్రబాబునిగానీ, మోడీని గానీ పల్లెత్తు మాట అనని పవన్.. విమర్శకులకు మరోసారి అడ్డంగా దొరికిపోయాడు.
ప్రత్యేక హోదా రాకపోతే పవన్ ఏం చేయనున్నాడో ఇప్పటికీ స్పష్టం చేయలేదు. దేశాన్ని స్థంభింపచేస్తా అని చెప్పిన పవన్ అందుకోసం ఏం చేస్తాడో సెలవివ్వలేదు. వవన్ చేతల్లోనే కాదు, మాటల్లోనూ క్లారిటీ లేకపోయింది. స్పీచ్ రాసుకొచ్చి చదవడం మరీ విడ్డూరం. ఆవేశంగల నాయకుడి మాట.. గుండెల్లోంచి రావాలి.. పేపర్లోంచి కాదు. చాలా చోట్ల సినిమాటిక్ డైలాగులు వదలడానికి ప్రయత్నించాడు పవన్. నా దగ్గర డబ్బుల్లేవు మొర్రో అంటూ మరోసారి బీద అరుపులు అరిచాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా, లేదా? అనేది ఇంకా స్పష్టం చేయలేదు. పవన్ స్పీచ్ ఆసాంతం విన్నాక.. పరిణితి లేని రాజకీయ నాయకుడిలానే అనిపించాడు. అయితే పవన్‌ని చూద్దామనో, లేదంటే పవన్ వెన్నంటి ఉందామనో ఆశేషంగా అభిమానులు తరలి వచ్చారు. ఈ జన బలం.. కచ్చితంగా అధికార పార్టీని కలవరపెట్టేదే. జనం సేకరించడంలో మాత్రం జనసేనాని సక్సెస్ అయ్యాడు. మిగిలిన వాటిలో తుస్సు మనిపించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



