హ్యాట్రిక్ కొట్టేశారు.. బాలయ్యని ఎలా చూపించాలో బోయపాటికి తెలుసు!
on Dec 2, 2021
'బాలయ్య బాబు ఓ ఆటమ్ బాంబు. దానిని ఎలా ప్రయోగించాలో బోయపాటికి తెలుసు' ఇది 'అఖండ' ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి చెప్పిన మాట. నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు ముక్తకంఠంతో ఈ మాటకి జై కొడతారు. కెరీర్ లో ఎన్నో విభిన్న పాత్రలు, విభిన్న సినిమాలు చేసి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న బాలయ్య.. 2004 నుండి పాత్రలు, సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ విమర్శలకు 2010 లో వచ్చిన 'సింహా'తో చెక్ పెట్టాడు బోయపాటి శ్రీను. బాలయ్య లుక్స్ కి, బాడీ ల్యాంగ్వేజ్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇన్నేళ్ళ తర్వాత బాలయ్య ని కరెక్ట్ గా చూపించిన డైరెక్టర్ బోయపాటే అంటూ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపించారు. 'సింహా' తరువాత బాలయ్య కొన్ని సినిమాలు చేశాడు. కానీ అవేవీ సరైన విజయాన్ని అందించలేకపోయాయి. మళ్లీ 2014 లో బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్'తో సాలిడ్ హిట్ అందుకున్నాడు బాలయ్య. ఆ తర్వాత మళ్ళీ మామూలే. 'లెజెండ్' తరువాత పలు సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేకపోయాడు బాలయ్య. ఇక 2019 లో వచ్చిన 'రూలర్' మూవీలో బాలయ్య లుక్స్ పై విపరీతమైన ట్రోల్ల్స్ వచ్చాయి. కట్ చేస్తే ఇప్పుడు 'అఖండ'తో బాలయ్య అనే ఆటమ్ బాంబుని ఎలా ప్రయోగించాలో చేసి చూపించాడు బోయపాటి.
సింహా, లెజెండ్ సినిమాల తరవాత బాలయ్య-బోయపాటి కాంబోలో రూపొందిన 'అఖండ' మూవీ నేడు(డిసెంబర్ 2)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. బాలయ్య-బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ పడింది అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలయ్య లుక్స్, యాక్టింగ్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన బాలయ్య.. మురళీ కృష్ణ పాత్రలో పంచెకట్టుతో ఎంట్రీతోనే ఆకట్టుకున్నాడు. బోయపాటి మాత్రమే బాలయ్యను ఈ రేంజ్ లో చూపించగలడు అనుకునేలా తెల్ల చొక్కా, తెల్ల లుంగీలో రాయల్ గా కనిపించాడు బాలయ్య. అసలు ఆ పాత్ర మొత్తం అదే కాస్ట్యూమ్ లో కనిపిస్తే బాగుండేది అనుకునే అంతలా ఆకట్టుకున్నాడు బాలయ్య. మురళీ కృష్ణ పాత్రను ఏ మాత్రం కష్టపడకుండా బాలయ్య చాలా ఈజీగా చేసి మెప్పించాడు. బాలయ్య కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్ విషయంలో బోయపాటి తీసుకునే శ్రద్ధే ఈ రిజల్ట్ కి కారణమని ఇప్పటికే సింహా, లెజెండ్ రుజువు చేశాయి. ఇప్పుడు అఖండ విషయంలోనూ అదే జరిగింది.
ఇక అఘోరా(అఖండ) పాత్రలో బాలయ్య కనిపించిన తీరు అమోఘం. ఆ పాత్రలో బాలయ్య జీవించాడనే చెప్పాలి. తనదైన బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఈ పాత్రకు తాను మాత్రమే న్యాయం చేయగలను అనుకునేలా నటించి మెప్పించాడు బాలయ్య. సినిమాలో మురళీ కృష్ణ పాత్ర ఒకెత్తు అయితే ఇంటర్వెల్ కి ముందు వచ్చే అఘోరా పాత్ర మరో ఎత్తు. అఘోరా పాత్రలో బాలయ్య కనిపించిన తీరుకి థియేటర్స్ మారుమోగిపోతున్నాయి. వన్ మ్యాన్ షోతో బాలయ్య అదరగొట్టాడు. సింహా, లెజెండ్ తరువాత బాలయ్య ఫ్యాన్స్ 'జై బాలయ్య' అంటూ గట్టిగా నినదిస్తూ థియేటర్ నుంచి బయటకి వచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. 'బాలయ్య ఓ ఆటమ్ బాంబు. దానిని ఎలా ప్రయోగించాలో బోయపాటికి తెలుసు' అని రాజమౌళి చెప్పిన మాట 'అఖండ'తో మళ్ళీ రుజువైంది అంటూ బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
