దర్శకుడు కాబోయి విలన్ అయ్యాను: సత్యప్రకాష్
on Dec 23, 2019

తాను దర్శకుడు కావాలనే ఇండస్ట్రీకి వచ్చాననీ, అవకాశాలు రావడంతో ప్రతినాయకుడిగా పలు చిత్రాల్లో నటించానని సత్యప్రకాష్ అన్నారు. ఇతడు పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది 'పోలీస్ స్టోరీ'. అందులో విలన్ పాత్రలో ఆయన కనబరిచిన నటన ప్రేక్షకుల్లో అంత బలమైన ముద్ర వేసింది. ఆ చిత్రానికి ముందు, తర్వాత ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించారు. సత్యప్రకాష్ అంటే క్రూరమైన విలన్ గుర్తొస్తారు. జనవరి 1న విడుదలకు సిద్ధమైన 'ఉల్లాల ఉల్లాల'తో ఆయన దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే, కుమారుడు నటరాజ్ ను హీరోగా తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సత్యప్రకాష్ మీడియాతో మాట్లాడారు.
"నేను దర్శకుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. రవిరాజా పినిశెట్టిగారి దగ్గర అసిస్టెంట్ గా చేరాలని వెళ్లా. అప్పుడు ఆయన సన్నీ డియోల్, పూజా భట్ జంటగా 'అంగరక్షక్' చేస్తున్నారు. 'ముందు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది. చెయ్' అనడంతో చేశా. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ హిందీలో సినిమాలు చేసేవారు. ఆయన్ను కలిశా. మోహన్ లాల్ గారి సినిమాలో క్యారెక్టర్ చేయమనడంతో చేశా. ఆ తర్వాత 'పోలీస్ స్టోరీ'లో విలన్ గా చేసే అవకాశం వచ్చింది. చేశా. 'పోలీస్ స్టోరీ' విడుదల తర్వాత దర్శకత్వం వైపు వెళ్లే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు వచ్చాయి. నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినవాడిని. విటమిన్ డి (డబ్బు) కోసం సినిమాలు చేశా. నటనలో నా ముద్ర వేయడానికి ప్రయత్నించా" అని సత్యప్రకాష్ అన్నారు.
'పోలీస్ స్టోరీ' నుండి 2007 సంవత్సరం వరకు నటుడిగా బిజీగా ఉన్నాననీ... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ, భోజ్ పురి భాషల్లో సినిమాలతో పాటు ఇంగ్లిష్ లో రెండు సినిమాలు చేశానని సత్యప్రకాష్ తెలిపారు. "2007 నుండి 2017 వరకు సినిమాలు చేశా. 'ఉల్లాల ఉల్లాల' పనులతో బిజీగా ఉండడంతో 2017 నుండి నటుడిగా సినిమాలు చేయలేదు" అని సత్యప్రకాష్ అన్నారు. ప్రేక్షకుల ఊహకు అందని మలుపులతో 'ఉల్లాల ఉల్లాల' తెరకెక్కించమని, ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ అనీ ఆయన అన్నారు. దీని తర్వాత పెద్ద నిర్మాణ సంస్థలో హీరోయిన్ బేస్డ్ థ్రిల్లర్ ఒకటి చేయడానికి చర్చలు జరుగుతున్నాయని సత్యప్రకాష్ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



