‘హరిహర వీరమల్లు’ చిత్రంలోని ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!
on Jul 24, 2025
పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ ఐదేళ్ళ నిరీక్షణ ఫలించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఉత్సాహం కనబరిచారు. ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్‌లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ప్రేక్షకులు, అభిమానులు సినిమాపై సరైన ఒపీనియన్ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రెగ్యులర్‌గా పవన్‌కళ్యాణ్ చేసే సినిమాల్లాంటిది కాదు ‘హరిహర వీరమల్లు’. ఒక కొత్త బ్యాక్‌డ్రాప్, కొత్త పాయింట్, డిఫరెంట్ జోనర్.. పైగా మొదటిసారి పవన్‌కళ్యాణ్ పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగుపెట్టారు. ఇన్ని కాలిక్యులేషన్స్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది? సినిమాకి ఉన్న బలాలు ఏమిటి, బలహీనతలు ఏమిటి అనేది పరిశీలిస్తే..
హరిహర వీరమల్లు అనే సినిమా ఓవరాల్‌గా జాతీయ వాదంపై ఉంటుంది. ఇటీవలి కాలంలో సనాతన ధర్మం అనేది ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా చేసినట్టుగా ఉంది. జాతీయ వాదాన్ని కాస్త బలంగా చెప్పేందుకు కొన్ని సన్నివేశాలను సహజత్వానికి దూరంగా చేశారనిపిస్తుంది. ఇక సినిమాకి ఉన్న బలాల గురించి చెప్పాల్సి వస్తే.. ప్రధానంగా పవన్‌కళ్యాణ్ గురించి చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పవన్‌కళ్యాణ్ పెర్‌ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో పవన్‌కళ్యాణ్ ఎనర్జీ ఆకట్టుకునేలా ఉంది. తోట తరణి వేసిన సెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమాకి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చాయి. ఇక కీరవాణి మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఈమధ్యకాలంలో వస్తున్న పాటలకు భిన్నంగా వినసొంపుగా అనిపించాయి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను ఒక రేంజ్‌లో చేశారు కీరవాణి. ఈ విషయంలో ఆయన్ని అభినందించాల్సిందే. బుర్రా సాయిమాధవ్ రాసిన మాటలు కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. వీరిద్దరూ కలిసి విజువల్‌గా మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.
ఇక సినిమాలో ఉన్న బలహీనతల గురించి చెప్పాలంటే.. ప్రధానంగా వినిపిస్తున్న అంశం విఎఫ్‌ఎక్స్. చాలా సన్నివేశాల్లో విఎఫ్‌ఎక్స్ అనేది చాలా పేలవంగా కనిపించిందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ఒక పాన్ ఇండియా మూవీ స్థాయిలో విఎఫ్‌ఎక్స్ లేదు అని ఘంటాపథంగా చెప్తున్నారు. దాని వల్ల దర్శకుడు ఆశించిన ఎఫెక్ట్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ ఎంతో స్పీడ్‌గా అనిపించింది. సెకండాఫ్‌కి వచ్చే సరికి చాలా ల్యాగ్ కనిపించింది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ కూడా ఉండడంతో కొన్ని అంశాలను అసంపూర్తిగా ముగించడం కూడా సినిమాకి మైనస్ అయిందని చెప్పాలి. ఒక విధంగా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అవసరం లేదని, కథంతా ఒక్క పార్ట్‌లోనే చెప్పేస్తే ఎంతో ఎఫెక్టివ్‌గా ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. నేచురల్ లొకేషన్స్‌లో చెయ్యాల్సిన చాలా సీన్స్‌ను ఇండోర్‌లో గ్రీన్ మ్యాట్‌లో చేశారని, దాని వల్ల విజువల్‌గా ఆకట్టుకోలేదు అంటున్నారు. ఈ సినిమా కోసం పవన్‌కళ్యాణ్ కేటాయించిన రోజులు తక్కువ కావడం కూడా దానికి ఒక కారణంగా చెబుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



