పవర్ స్టార్ `తొలిప్రేమ`కి 23 ఏళ్ళు!
on Jul 24, 2021
తెలుగునాట ఎన్నో ప్రేమకథా చిత్రాలు సందడి చేశాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే క్లాసిక్స్ గా నిలిచాయి. అలాంటి సినిమాల్లో `తొలిప్రేమ` ఒకటి. అంతేకాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ లా నిలిచిందీ క్లాసిక్. ఇందులో బాలుగా పవన్ అభినయం యువ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. అతణ్ణి అప్పట్లో `యూత్ ఐకాన్`గా నిలిపింది. ఎ.కరుణాకరన్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో పవన్ కి జంటగా కీర్తి రెడ్డి నటించగా.. వాసుకి, నగేశ్, అలీ, వేణుమాధవ్, అచ్యుత్, రవిబాబు, పీజే శర్మ, నర్రా వెంకటేశ్వరరావు, సంగీత, బెంగుళూరు పద్మ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించారు.
`యువతకు ఓ లక్ష్యం ఉండాలి` అనే పాయింట్ చుట్టూ ఈ సినిమాని అల్లుకున్నారు దర్శకుడు కరుణాకరన్. అను (కీర్తి రెడ్డి)ని తొలిచూపులోనే ప్రేమించిన బాలు.. జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగే ఆమె ప్రేమను పొందాడా? లేదా? అను ప్రేమ బాలు లక్ష్యానికి ఎలాంటి స్ఫూర్తినిచ్చింది? అనే కథాంశంతో `తొలిప్రేమ` తెరకెక్కింది. కేవలం ప్రేమకథకే పరిమితం కాకుండా అన్నాచెల్లెళ్ళ అనుబంధం, కుటుంబ బంధాలకు పెద్దపీట వేస్తూ సినిమాని ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించి అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందాడు దర్శకుడు కరుణాకరన్.
`ఉత్తమ ప్రాంతీయ చిత్రం` (తెలుగు)గా `జాతీయ` పురస్కారాన్ని అందుకున్న `తొలిప్రేమ`.. `బెస్ట్ ఫీచర్ ఫిల్మ్`, `బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్`, `బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్` (వాసుకి), `బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్` (కరుణాకరన్), `బెస్ట్ ఆడియోగ్రాఫర్` (మధుసూదన్), `బెస్ట్ ఎడిటర్` (మార్తాండ్ కె. వెంకటేశ్) విభాగాల్లో `నంది` అవార్డులను సొంతం చేసుకుంది. హిందీలో `ముఝే కుచ్ కెహనా హై` (తుషార్ కపూర్, కరీనా కపూర్), కన్నడలో `ప్రీతిసు తప్పేనిల్ల` (వి. రవిచంద్రన్, రచన) పేర్లతో ఈ సినిమా రీమేక్ అయింది.
దేవా అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. ``ఈ మనసే``, ``గగనానికి ఉదయం ఒకటే``, ``ఏమైందో ఏమో ఈ వేళ``, ``ఏమి సోదరా``, ``రొమాన్స్ రిథమ్స్``.. ఇలా ఇందులోని గీతాలన్ని అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించాయి. జీవీజీ రాజు నిర్మించిన `తొలిప్రేమ`.. 1998 జూలై 24న విడుదలై అఖండ విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 23 వసంతాలను పూర్తిచేసుకుంది.
Also Read