పవన్, నేను మాట్లాడుకోలేదన్నది అబద్ధం.. మేం స్టేజి కింద మాట్లాడుకున్నాం!
on Oct 18, 2021

ఆదివారం హైదరాబాద్‌లోని జలవిహార్ దగ్గర జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను ఎడముఖం పెడముఖంగా ఉన్నామని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. స్టేజి మీద తాము మాట్లాడుకోలేదన్నది నిజమనీ, అయితే దానికంటే ముందు స్టేజి కింద తాము మాట్లాడుకున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన విష్ణు, అలయ్ బలయ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారనీ, అందువల్ల స్టేజిపై ప్రోటోకాల్‌కు తగ్గట్లు నడచుకున్నామనీ ఆయన స్పష్టం చేశారు.
"మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌మి. చిరంజీవి గారి దగ్గర్నుంచీ మేమందరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీడియాకి తెలిసింది.. మీరు చూసింది అక్కడ స్టేజి మీద కనిపించిందే. కానీ స్టేజి ఎక్కక ముందు మా ఇద్దరి మధ్య సంభాషణ వేరే జరిగింది. అక్కడ మిగతా వాళ్లందరి ముందూ మేం మాట్లాడుకున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామనేది చెప్పాల్సింది ఇంకో రోజు. అది ఈ రోజు చెప్పాల్సింది కాదు. నేను ఆయనతో జోక్ చేశాను కూడా." అని విష్ణు తెలిపారు.
స్టేజి మీద భారతదేశ ఉపరాష్ట్రపతి ఉన్నారనీ, ఆయన ఉన్నప్పుడు తాము ప్రోటోకాల్ ఫాలో అయ్యి, ఎక్కువ మాట్లాడుకోకూడదనీ ఆయన చెప్పారు. "అక్కడ ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ గారినీ, నన్ను సన్మానించారు. మేం మాట్లాడుకున్నది మీరు షూట్ చేయలేదు కానీ, స్టేజి మీద మేం నిలబడి ఉన్నది మాత్రం షూట్ చేసి.. మేం మాట్లాడుకోలేదని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఆయన చిన్న స్టార్ కాదు, బిగ్ స్టార్. మా మధ్య జరిగిన సంభాషణల్లో ఒకటి చెప్తాను. 'ఇది (మా) మన తల్లి. జాగ్రత్తగా చూసుకో విష్ణూ' అన్నారు. ఆయన అసోసియేషన్‌లో అంతర్భాగం." అని చెప్పుకొచ్చారు విష్ణు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



