'పరంపర 2' సిరీస్ రివ్యూ
on Jul 25, 2022

తారాగణం: నవీన్ చంద్ర, శరత్ కుమార్, జగపతి బాబు, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని, ప్రవీణ, కస్తూరి, రవివర్మ, దివి వడ్త్య, నైనా గంగూలీ, రాజశేఖర్ అనింగి
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: ఎల్. కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్
బ్యానర్: ఆర్కా మీడియా వర్క్స్
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్: డిస్నీప్లస్ హాట్‌స్టార్
'పరంపర' సీజన్ 1 మంచి వీక్షకాదరణ పొందడంతో ఆర్కా మీడియా వర్క్స్ రెండో సీజన్‌ను నిర్మించింది. మెరుగైన నిర్మాణ విలువలతో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చిన 'పరంపర' సీజన్ 2 ఎలా ఉంది? మొదటి సీజన్ కంటే బెటర్‌గా ఉందా? నాయుడు (శరత్‌కుమార్), గోపి (నవీన్ చంద్ర) మధ్య శత్రుత్వం ఎక్కడికి దారి తీసింది? ఫస్ట్ సీజన్‌లో పైచేయి సాధించిన నాయుడు, ఈ సెకండ్ సీజన్‌లోనూ దాన్ని కొనసాగించగలిగాడా? సురేశ్ (ఇషాన్), రచన (ఆకాంక్ష సింగ్) పెళ్లి జరుగుతుండగా వచ్చి, గన్‌తో హంగామా చేసి, అరెస్టయిన గోపి ఏం ప్లాన్ చేశాడు?.. అనేవి మన ముందున్న ప్రశ్నలు.
నిజం చెప్పాలంటే ఐదు ఎపిసోడ్ల 'పరంపర 2' మొదటి సీజన్‌తో పోలిస్తే తేలిపోయిందనే చెప్పాలి. 'పరంపర'లో ఒకే ఇంట్లో శత్రువులుగా ఉండేవాళ్లు ఎలా కలిసి గడుపుతున్నారా? అని మనకు ఆశ్చర్యం వేసింది. నాయుడు, అతని కొడుకు సురేశ్ ఒకవైపు, గోపి ఒకవైపు ఉండి పరస్పరం కత్తులు నూరుతూ ఉంటే.. ఆ సంగతి ఆ ఇంట్లోని మిగతా వాళ్లందరికీ తెలిసి కూడా ఎలా కలిసి ఉండగలుగుతారు? ఎందుకు విడిపోకుండా ఉన్నారు? అనేది మనకు అంతు చిక్కని ప్రశ్న. నిజ జీవితంలో ఇలా ఉండగలగడం మనుషులకు అసాధ్యం. 'పరంపర' లాంటి కథలోని పాత్రలకి మాత్రమే సాధ్యం!
జైలుకు వెళ్లిన గోపి, అక్కడ ఖైదీగా రాజభోగాలు అనుభవిస్తోన్న పెద్దమనిషి రవివర్మ సాయంతో బెయిల్ మీద బయటకు వచ్చి, మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టి, బాబాయ్ నాయుడుకు పక్కలో బల్లెంలా తయారవుతాడు. హైకమాండ్ ద్వారా వచ్చే ఎలక్షన్లలో కొడుకు సురేశ్‌కు ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తాడు నాయుడు. తండ్రిని రాజకీయాల్లో దించాలని గోపి ఎంతగా ఆశపడినా, మోహన్‌రావు అంగీకరించడు. దాంతో తల్లి భానుమతి (ఆమని)ని రంగంలోకి దించుతాడు గోపి. ఈ ట్విస్టును ఊహించని నాయుడు, మోహన్‌రావు.. ఇద్దరూ షాకవుతారు. అదివరకే తల్లిపేరిట భానుమతి ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి, దాని ద్వారా జనానికి సాయం చేస్తూ వస్తాడు గోపి. ఎలక్షన్ ప్రచారం కొనసాగేకొద్దీ భానుమతి బలం పెరుగుతోందని అర్థమైన నాయుడు ఏం చేశాడు? కొడుకు సురేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించడానికి ఎంత దాకా వెళ్లాడు? నాయుడును గోపి అడ్డుకోగలిగాడా? ఆ ఇద్దరి పంతానికి మూల్యం ఏమిటి? అనేది మిగతా కథ.
సురేశ్, రచనలకు పెళ్లయినా.. ఆ ఇద్దరూ కలవరు. తనను పెళ్లి చేసుకోవడానికి సురేశ్ చేసిన పనులు కూడా రచనకు తెలుస్తాయి. దాంతో ఆమె నాయుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోతుంది. తన తల్లితండ్రులు యాక్సిడెంట్‌లో చనిపోలేదనీ, హత్యకు గురయ్యారనీ ఆమె తెలుసుకుంటుంది. హంతకులు ఎవరో తెలిసి ఆమె షాకవుతుంది? కానీ ఆమెలో ప్రతీకార వాంఛ లాంటిదేమీ కలగకపోవడం ఓ వింత. నాయుడు అక్రమ బాక్సైట్ గనుల తవ్వకాన్ని తెలుసుకున్న ఆమె.. దాన్ని బయటపెట్టడానికి ఎస్పీ పరశురామ్ సాయం కోరుతుంది. అది చాలా డేంజరస్ మిషన్ అని అతను చెప్పినా, ఆమె వినదు. దాంతో అతను స్వయంగా ఆ ఆపరేషన్‌లోకి దిగి నాయుడు మనుషులకు దొరికిపోతాడు. తనవల్లే అతను ప్రమాదంలో పడ్డాడనే పశ్చాత్తాపం రచనలో ఏమాత్రం కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఆ తర్వాత కూడా మనకు పరశురామ్ ఏమయ్యాడో తెలియదు. బహుశా 'పరంపర' మూడో సీజన్ వస్తే.. అందులో సమాధానం లభిస్తుందేమో..
స్క్రీన్‌ప్లే పరంగా పలు లూప్ హోల్స్ కనిపించే 'పరంపర 2'లో మనకు నచ్చేది నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్. ఫస్ట్ సీజన్‌లో శరత్‌కుమార్ ముందు తేలిపోయిన అతను, ఈ సీజన్‌లో డామినెంట్ పర్ఫార్మెన్స్ చూపించాడు. నాయుడు వేసే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ, ఓ అడుగు ముందుండేవాడిగా ఈ సీజన్‌లో గోపి పాత్రను మలిచారు. అందుకు తగ్గట్లే మంచి అభినయం చూపించాడు నవీన్‌చంద్ర. నాయుడుగా శరత్‌కుమార్ మొదటి సీజన్ తరహాలోనే కనిపించాడు. ఆ సీజన్‌లో మెత్తగా కనిపించిన మోహన్‌రావు క్యారెక్టర్ ఈసారి కాస్త యాక్టివ్‌గా మారడంతో జగపతిబాబు కూడా అందుకు తగ్గట్లు రాణించాడు. రచనగా ఆకాంక్ష సింగ్, సురేశ్‌గా ఇషాన్, భానుమతిగా ఆమని తమ పాత్రలకు న్యాయం చేశారు. అలాగే కస్తూరి, ప్రవీణ (నాయుడు భార్య), రవివర్మ, రాజశేఖర్ అనంగి కూడా పాత్రోచితంగా నటించారు. ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన దివి వడ్త్య ఆకట్టుకోలేదు. జెస్సీ పాత్రధారి నైనా గంగూలీకి ఈ సీజన్‌లో నటించేందుకు ఎక్కువ స్కోప్ లభించలేదు.
చివరిదాకా మనల్ని చూడాలనిపించే పాయింట్ ఉన్నప్పటికీ, దాన్ని డైరెక్టర్స్ సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయారు. స్క్రీన్‌ప్లేను ఇంకా బలంగా రాసుకుని ఉండినట్లయితే, మరింత ఆసక్తికరంగా ఈ సిరీస్ వచ్చుండేది. క్లైమాక్స్ మన అంచనాలకు తగ్గట్లే ఉండటం ప్లస్ పాయింట్.
రేటింగ్: 2.5/5
- బుద్ధి యజ్ఞమూర్తి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



