నాగ్ రుణం తీర్చుకొన్న చిరు
on Feb 10, 2017
కారణాలేమైనా గానీ.. ఈమధ్య మన కథానాయకుల్లో ప్రోత్సహించే తత్వం పెరిగింది. తోటి కథానాయకుడు ఓ మంచి సినిమా తీస్తే `శభాష్` అంటూ మెచ్చుకోవడానికి హీరోలంతా ముందుకొస్తున్నారు. నిజంగా ఇది శుభపరిణామమే. ఈ సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెం.150ని నాగార్జున దిగ్విజయంగా మోసేశాడు. చిరు డాన్సులు ఇరగ్గొట్టాడని, అందరిలోనూ స్ఫూర్తి రగిలించాడని, చిరు ఇలానే మరో ఐదారేళ్లు సినిమాలు చేస్తూనే ఉండాలని.. మీడియా ముందు చాలాసార్లు మెచ్చుకొన్నాడు నాగ్. ఇప్పుడు చిరంజీవి వంతు వచ్చింది. నాగ్ నటించిన నమో వేంకటేశాయ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిరంజీవి ఈ సినిమాని అందరికంటే ముందే చూసేశాడు.
అంతేకాదు.. నాగ్‌పై ప్రశంసల వర్షం కురిపించడం మొదలెట్టాడు. సినిమా అద్భుతంగా ఉందని, ఇలాంటి పాత్రలు చేయాలంటే మిత్రుడు నాగ్‌కి మాత్రమే సాధ్యమని, ఈ సినిమా ఓ అద్భుతమైన భక్తి ప్రయాణమని కితాబుల మీద కితాబులు ఇచ్చేస్తున్నాడు. సో.. లెక్క సరిపోయిందన్నమాట. మనస్ఫూర్తిగా మెచ్చుకోళ్లు ఇచ్చి పుచ్చుకొంటున్నారో, లేదంటే.... `నీ సినిమాకి నేను పొగుడుతా.. నా సినిమాని నువ్వు పొగుడు` అంటూ దీన్ని కూడా కమర్షియల్ గా పబ్లిసిటీ కోణంలోనే ఆలోచిస్తున్నారో తెలీదుగానీ మొత్తానికి మన హీరోలు చాలా మారారు. ఈ మార్పు కలకాలం ఇలానే ఉండాలని కోరుకొందాం.