త్రివిక్రమ్ మొదటి సినిమా 'నువ్వే నువ్వే' రీరిలీజ్!
on Nov 2, 2022

'స్వయంవరం', 'నువ్వే కావాలి', 'చిరునవ్వుతో', 'నువ్వు నాకు నచ్చావ్', 'మన్మథుడు' వంటి చిత్రాలకు రచయితగా పనిచేసి మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. 'నువ్వే నువ్వే'(2002) సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్ళయినా ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది.
తరుణ్, శ్రియ జంటగా నటించిన 'నువ్వే నువ్వే' ఈ అక్టోబర్ 10తో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఈ ఏడాది రీరిలీజ్ చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ నిర్ణయించింది. కొంతకాలంగా టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. 'నువ్వే నువ్వే' విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా త్రివిక్రమ్ పుట్టినరోజు(నవంబర్ 7)ని పురస్కరించుకొని నవంబర్ 4 నుంచి నవంబర్ 7 వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నట్టు తాజాగా మేకర్స్ ప్రకటించారు.

'నువ్వే నువ్వే' చిత్రంలో ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి, అనితా చౌదరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి కోటి సంగీతం అందించగా.. ఉన్న ఆరు పాటలకూ సిరివెన్నెల సాహిత్యం అందించడం విశేషం. ఈ చిత్రంలోని అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి.
నువ్వే నువ్వే' చిత్రానికి ప్రేక్షకుల అభిమానంతో పాటు పురస్కారాలూ దక్కాయి. నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో 'సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్'గా 'నువ్వే నువ్వే' నిలిచింది. ఉత్తమ సంభాషణల రచయితగా త్రివిక్రమ్ నంది అవార్డు అందుకున్నాడు. ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో ఉత్తమ సహాయ నటుడిగా ప్రకాశ్ రాజ్ పురస్కారం అందుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



