ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్...
on Oct 20, 2020
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అక్టోబర్ 22 కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. రాబోయే 48 గంటలు వాళ్లకు నాలుగు యుగాలుగా గడుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి అసలు లేనేలేదు. ఎందుకంటే... 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' చిత్రంలో జూనియర్ నందమూరి తారక రామారావు టీజర్ ఈ నెల 22న విడుదల కానున్న సంగతి తెలిసిందే. నిజానికి తారక్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తారని ఆశించారు. అయితే... చిత్రీకరణ పూర్తి కాకపోవడం వల్ల కుదరలేదు.
'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ పునః ప్రారంభించిన తర్వాత ఎన్టీఆర్ టీజర్ ఏ రోజున విడుదల చేస్తామనేది చెప్పారు. ఇప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తారో కూడా చెప్పారు. అక్టోబర్ 22న ఉదయం 11 గంటలకు కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ లుక్, అలాగే టీజర్ విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఎన్టీఆర్ టీజర్ ప్రారంభం కానుంది. కొమరం భీం గొప్పతనాన్ని అల్లూరి సీతా రామ రాజు అలియాస్ చరణ్ తన మాటల్లో వినిపించనున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.