అభిమాన హీరోనే ఆశ్చర్యపరిచిన 'అల్లూరి సీతారామరాజు'
on Nov 15, 2022

కొన్ని పాత్రలు కొందరి కోసమే పుట్టినట్టుంటాయి. ఆ పాత్రల్లో వారిని తప్ప ఎవరినీ ఊహించుకోలేం. అలాంటి పాత్రలు సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లోనూ ఉన్నాయి. అందులో 'అల్లూరి సీతారామరాజు' ప్రత్యేకం. ఆ పాత్రలో ఆయన నటించలేదు.. జీవించారు. అల్లూరిగా కృష్ణను చూసిన కళ్ళతో ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోలేమంటే అతిశయోక్తి కాదు. 'అల్లూరి సీతారామరాజు' చిత్రం చూసి సీనియర్ ఎన్టీఆర్ అంతటివాడు అల్లూరి పాత్ర పోషించాలనే ఆలోచనను విరమించుకున్నారంటే ఆ పాత్రలో కృష్ణ ఎంతటి ప్రభావం చూపారో అర్థం చేసుకోవచ్చు.
ఎన్టీఆర్ అభిమానిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణ.. అభిమాన హీరోతో కలిసి పలు సినిమాల్లో నటించారు. తన సినిమా వేడుకలకు ఎన్టీఆర్ ను పిలవడం, తన సినిమాలను ఎన్టీఆర్ కు చూపించడం వంటివి చేసి తన అభిమానాన్ని చాటుకునేవారు కృష్ణ. అయితే ఒక సినిమా కారణంగా కొన్నేళ్ల పాటు ఇద్దరి మధ్య మాటల్లేవు. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో 'దాన వీర సూర కర్ణ' చేయాలనుకున్న సమయంలోనే కృష్ణ అర్జునుడిగా 'కురుక్షేత్రం' మొదలైంది. అప్పుడు ఎన్టీఆర్ కృష్ణని పిలిచి "నేను చేస్తున్నానని తెలుసు కదా బ్రదర్.. రెండూ ఒకే కథ అవుతాయి" అని చెప్పారట. కానీ కృష్ణ తప్పనిసరి పరిస్థితుల్లో నిర్మాత కోసం 'కురుక్షేత్రం' చేయాల్సి వచ్చిందట. దీంతో కొన్నేళ్లపాటు కృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడలేదు.
తన సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన ఎన్టీఆర్ కు పూర్తిస్థాయిలో 'అల్లూరి సీతారామరాజు' పాత్రతో సినిమా చేయాలనే కల ఉండేది. కానీ ఏవో కారణాల వల్ల అది కుదరలేదు. అయితే ఒకసారి ఆయన రచయితలు పరుచూరి బ్రదర్స్ ని పిలిచి 'అల్లూరి సీతారామరాజు' కథ సిద్ధం చేయాలని అడగగా.. వారు "ఒక్కసారి కృష్ణ గారు నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం చూడండి" అని కోరారట. దీంతో చాలాకాలం తర్వాత కృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడారు. ఒకసారి వాహిని స్టూడియోలో కృష్ణ కనిపిస్తే ఎన్టీఆర్ పిలిచి "బ్రదర్ నాకు మీరు నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రం చూపించండి" అని అడిగారట. దీంతో కృష్ణ ఆయనకు ప్రత్యేకంగా షో వేసి చూపించారు. సినిమా చూసిన ఎన్టీఆర్.. కృష్ణను హత్తుకొని "ఇంతకంటే ఈ సినిమాని ఎవరూ బాగా తీయలేరు" అని అభినందించారు. ఆ వెంటనే "మనం అల్లూరి సీతారామరాజు సినిమా చేయాల్సిన అవసరం లేదు" అని పరుచూరి బ్రదర్స్ కి చెప్పారట. మహానటుడు ఎన్టీఆరే అల్లూరి పాత్రలో కృష్ణను మరిపించలేను అనుకున్నారంటే.. ఆ పాత్రకు కృష్ణ ఎంతలా ప్రాణం పోశారో ప్రత్యేకంగా చెప్పాలా!.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



