'ఎన్టీఆర్ 30' అప్డేట్.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!
on Oct 9, 2022

'ఆర్ఆర్ఆర్'తో జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడన్న ఆనందం అభిమానుల్లో ఎంత ఉందో.. ఆయన తదుపరి సినిమాకి సంబంధించిన అప్డేట్ రావట్లేదన్న నిరాశ కూడా వారిలో అంతే ఉంది. అయితే ఇక వారి ఎదురుచూపులకి ఫుల్ స్టాప్ పడినట్లేనని అంటున్నారు.
తారక్ తన 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. 'వస్తున్నా' అంటూ విడుదల చేసిన అనౌన్స్ మెంట్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ చిత్ర ప్రారంభమే కొన్ని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఒకానొక సమయంలో అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేశారు.
అయితే ఓ వైపు ఇది 'ఆర్ఆర్ఆర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం, మరోవైపు 'ఆచార్య' వంటి ఘోర పరాజయం తర్వాత కొరటాల చేస్తున్న సినిమా కావడంతో 'ఎన్టీఆర్ 30' స్క్రిప్ట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని అదే ఆలస్యానికి ప్రధాన కారణమని అంటున్నారు. అంతేకాదు ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల(నవంబర్)లో ప్రారంభం కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే ఈ దీపావళికి అఫీషియల్ అప్డేట్ రావొచ్చని టాక్.
ఇక 'ఎన్టీఆర్ 30'లో హీరోయిన్ ఎవరనే విషయంపైనా ఇంకా స్పష్టత రాలేదు. రష్మిక మందన్న పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



