ఏపీ ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు.. ప్రేక్షకులను అవమానించింది!
on Dec 23, 2021

ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సినీ అభిమానుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ తప్పుబడుతున్నారు. ఈ ధరలతో థియేటర్స్ నడపడం కష్టమని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కల్యాణ మండపాలుగా మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ వైపు తెలుగు సినిమా స్థాయి ఖండాంతరాలు దాటి వెళ్తుంటే.. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో అసలు నిర్మాతలు సినిమా తీయాలంటేనే భయపడేలా చేస్తుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో పలు థియేటర్స్ ముందు 'అనివార్య కారణాల వల్ల షో వేయలేకపోతున్నామన్న' బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడంతో.. నష్టాలతో థియేటర్స్ ని నడపలేక ఈ బోర్డులను పెడుతున్నారని అంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో 50కి పైగా థియేటర్లు స్వచ్ఛందంగా మూత పడ్డాయన్న వార్త సంచలనంగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల అమ్మకాలు కొనసాగించాలన్న అధికారుల ఆదేశాలతో.. థియేటర్ యాజమాన్యాలు తాత్కాలికంగా థియేటర్స్ ని మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. "పెద్ద హీరోల సినిమాలకు, పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చర్యలు తీసుకుంటాం. బెనిఫిట్ షోలకు తప్పకుండా అనుమతి తీసుకోవాలి" అని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడే అవకాశముందని అంటున్నారు.
ఇప్పటికే దీని ప్రభావం ఇటీవల విడుదలైన పుష్ప సినిమాపై కనిపిస్తోంది. హిందీలోనూ, నైజాంలోనూ మంచి కలెక్షన్లను రాబడుతున్న పుష్ప.. ఆంధ్రా, సీడెడ్ లో భారీ నష్టాలను మూటగట్టుకునే దిశగా పయనిస్తుంది. కొన్ని థియేటర్లను సీజ్ చేయడం, అత్యల్ప టికెట్ ధరల కారణంగా కొన్ని థియేటర్లు మూతపడటం వసూళ్లపై దారుణంగా దెబ్బకొట్టాయని అంటున్నారు.
దీంతో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు భయపడుతున్నాయి. రేపు(డిసెంబర్ 24) నాని నటించిన 'శ్యామ్ సింగ రాయ్' విడుదల కానుంది. ఈ మేరకు గురువారం మూవీ టీమ్ తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని కాదని అన్నాడు. ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని.. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని నాని వ్యాఖ్యానించారు.
ఈ విషయంలో సినీ పరిశ్రమ అంతా ఏకమై జగన్ సర్కార్ పై యుద్ధం ప్రకటిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



