ఆంధ్రా ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పి తీరాలి.. నట్టి కుమార్ డిమాండ్!
on Dec 23, 2021

టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందని కాదనీ, ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందనీ హీరో నాని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. నాని ధైర్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా థియేటర్లు ఎదుర్కొంటోన్న క్లిష్ట స్థితిని బయటపెట్టారని అంటూ సోషల్ మీడియాలో ఆయనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. రేపు రిలీజ్ కాబోతున్న తన సినిమా 'శ్యామ్ సింగ రాయ్' ప్రమోషన్‌లో భాగంగా గురువారం మీడియాతో మాట్లాడిన నాని థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్ ఎక్కువగా ఉందని కూడా వ్యాఖ్యానించారు.
అయితే నాని వ్యాఖ్యలను సీనియర్ ప్రొడ్యూసర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తప్పుపట్టారు. వెంటనే నాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. "నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పాలి. తెలిసో తెలియకో ఆయన మాట్లాడారు. ఆయన క్షమాపణలు చెప్పి తీరాల్సిందే. మేం ఎగ్జిబిటర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా సినిమాలు ఇవ్వమని ప్రాధేయపడినప్పుడు, తన రెండు సినిమాలను ఆయన థియేటర్లకు ఇవ్వకుండా ఓటీటీకి ఎందుకిచ్చారు? అప్పుడులేని ప్రేక్షకులపై ప్రేమ ఇప్పుడెందుకు వచ్చింది?" అని ఆయన ప్రశ్నించారు.
Also read: భారీగా పడిపోయిన 'పుష్ప' వసూళ్లు! ఆంధ్రప్రదేశ్‌లో భోరుమంటున్న బయ్యర్లు!
ఆంధ్రప్రదేశ్‌లో రూ. 35 టికెట్‌ను ఏ థియేటర్‌లోనూ అదే రేటుకు అమ్మలేదనీ, దాన్ని రూ. 100కు అమ్మారనీ, తన థియేటర్ కూడా అందుకు మినహాయింపు కాదనీ నట్టి కుమార్ చెప్పడం గమనార్హం. "ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 35 టికెట్‌ను అదే రేటుకి అమ్మారా? అమ్మిన ఎగ్జిబిటర్‌ను కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. గవర్నమెంట్ చూసీ చూడనట్లు ఊరుకుందని చెప్పి, వాళ్ల మంచితనాన్ని ఆసరాగా తీసుకొని, ఒక పొలిటికల్ సెటైర్ లాగా గవర్నమెంట్‌ని విమర్శించడం కరెక్ట్ కాదు. ఆంధ్రాలో అనంతపురం నుంచి ఇచ్ఛాపురం దాకా రూ. 35 టికెట్‌ను అదే ధరకు ఎవరూ అమ్మలేదు.. ఆఖరుకి నా థియేటర్ కూడా. అందరం రూ. 100కే అమ్మాం. ఏ గవర్నమెంటూ ఇబ్బంది పెట్టలేదు." అని ఆయన అన్నారు.
Also read: 'సెకండ్ హ్యాండ్ ఐటమ్' అంటూ నీచమైన పోస్ట్ పెట్టిన నెటిజన్.. ఇదీ సమంత రెస్పాన్స్!
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో పలు థియేటర్లను సీజ్ చేయడంపై కూడా నట్టి స్పందించారు. "లైసెన్సులు లేని, ఫైర్ సేఫ్టీలేని థియేటర్లను మాత్రమే సీజ్ చేశారు. ఇంతదాకా అవి ఎలా నడిచాయో స్థానిక రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు తెలియాలి. దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రీలోని ఒక వర్గం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. ప్రభుత్వం మంచి ఆలోచనతోనే టికెట్ ధరలు తగ్గించింది తప్ప, ఎవరిమీదా కక్షసాధించడానికి తగ్గించలేదు. ప్రేక్షకులకు అందుబాటు ధరల్లో సినిమాలను చూపించాలనే మంచి ఉద్దేశంతోనే టికెట్ ధరలు తగ్గించింది." అని ఆయన చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



