ఎన్టీఆర్ ని దాటేసిన నాని!
on Mar 31, 2023
నిన్న మొన్నటి దాకా టైర్-2 హీరో అనిపించుకున్న నేచురల్ స్టార్ నాని ఇక టైర్-1 లిస్టులో చేరిపోయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాని నటించిన తాజా చిత్రం 'దసరా' ఓపెనింగ్స్ ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.38 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇదిలా ఉంటే 'దసరా'తో నాని, యూఎస్ లో అత్యధిక మిలియన్ డాలర్ల సినిమాలు కలిగిన తెలుగు హీరోల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ ను దాటేసి రెండో స్థానానికి చేరుకోవడం విశేషం.
యూఎస్ లో 'దసరా' సినిమా ఇప్పటికే 9 లక్షలకు పైగా డాలర్లు వసూలు చేసింది. మరికొద్ది గంటల్లో 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరనుంది. గతంలో నాని నటించిన ఏడు సినిమాలు ఈ ఫీట్ సాధించగా.. దసరా ఎనిమిదవది. దీంతో యూఎస్ లో అత్యధిక మిలియన్ డాలర్ల సినిమాలు కలిగిన టాలీవుడ్ హీరోల లిస్టులో ఎన్టీఆర్ తో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్న నాని.. ఇప్పుడు దసరాతో ఎన్టీఆర్ ను ఒక స్థానం వెనక్కి నెట్టాడు.
యూఎస్ మిలియన్ డాలర్ల సినిమాల పరంగా 11 సినిమాలతో మహేష్ బాబు టాప్ లో ఉండగా.. 8 సినిమాలతో రెండో స్థానంలో నాని, 7 సినిమాలతో ఎన్టీఆర్ మూడో స్థానంలో నిలిచారు. ఇక 6 సినిమాలతో పవన్ కళ్యాణ్, 5 సినిమాలతో అల్లు అర్జున్, 4 సినిమాలతో ప్రభాస్, చిరంజీవి, వరుణ్ తేజ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
